బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ కారకులను అరెస్ట్ చేయాలి.
బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ సమస్యల సాధన కోసం చేసిన ఆందోళన మరచిపోక ముందే మరోసారి విషపు ఆహారం విద్యార్థులకు పెట్టడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో మరోసారి బట్టబయలైందని సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు.
బాసర విద్యార్థుల క్యాంటీన్ టెండర్ ను వెంటనే రద్దు చేయాలని డేట్ ఎక్స్పైర్ అయిన పనికిరాని విషతుల్యమైన వంట నూనెలను వాడిన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దాదాపు 300 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో ఆసుపత్రుల పాలైతే కనీసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విషయంలో కనీస వసతులు కల్పించకుండా ఆహారం, ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నది అనే విషయం కేవలం బాసర విద్యార్థులను చూస్తేనే అర్థమవుతుందని ఆయన అన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ కి కారకులైన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటనలు తిరిగి ఎక్కడ పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ నాయకులు మారోజు రాజ్ కుమార్, కుంభం శివరాజ్, గొడ్డేటి చంద్రశేఖర్, జిట్టబోయిన అనిల్, పార్థు, శివ, మధు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.