బిక్స్‌ కూటమి కొత్త బ్యాంక్‌

రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం
డర్బన్‌, (జనంసాక్షి) :
వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ, ప్రపంచ అభివృద్ధి కోసం కొత్త బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిక్స్‌ కూటమి ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కూటమి సదస్సు బుధవారం ప్రారంభమైంది. కూటమిలోని 5 దేశాధినేతలతో పాటు ఆఫ్రికాకు చెందిన 12 దేశాల నాయకులు పాల్గొన్నారు. బ్యాంకు ఎక్కడ ఏర్పాటు చేయాలి, వాటాల కేటాయింపు తదితర విషయాల్లో స్పష్టత ఏర్పరుచుకుని రెండేళ్లలో  బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని కూటమి పేర్కొంది. పనితీరులో ప్రపంచ బ్యాంకును అధిగమించాలని నిర్ణయించింది. బ్యాంకు ఏర్పాటుతో అగ్ర రాజ్యాలకు దీటుగా బ్రిక్స్‌ దేశాలు స్వయంసమృద్ధి సాదిస్తాయని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు డర్బన్‌లోని కింగ్‌ శకా అంతర్జాతీయ విమానాశ్రమంలో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు దక్షిణాఫ్రికా న్యాయశాఖ మంత్రి జెఫ్రీ తమ్‌సంక్యా రడేబే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మన్మోహన్‌ మాట్లాడుతూ బ్రిక్స్‌ కూటమిలోని దేశాలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా తద్వారా ప్రపంచ వాణిజ్య, వ్యాపార అవసరాలు తీర్చేలా బ్యాంకును తీర్చుదిద్దుతామన్నారు.