బిజెపితో ఒరిగేదేవిూ లేదు
విలేకరుల సమావేశంలో బాల్క సుమన్
హుజూరాబాద్,ఆగస్టు17(జనంసాక్షి): ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. గెలిస్తే ఏం చేస్తారో చెప్పలేని వారు..గెల్చినా ఏఈ చేయలేని వారు పోటోలో ఉన్నారని అన్నారు. మంగళవారం బాల్క కమలాపూర్‌లో విూడియాతో మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నిక మాటల బీజేపీ ప్రభుత్వానికి, చేతల టీఆర్‌ఎస్‌కు మధ్య, కబ్జాకోరులు, నిఖార్సైన పేదబిడ్డకు పోటీ అని వ్యాఖ్యానించారు. రెండు వందల ఎకరాలు ఉన్న భూస్వామికి, గుంట భూమి లేని బీసీ బిడ్డకు పోటీ జరగబోతుందని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని సుమన్ కోరారు. ఈటల రాజేందర్ బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నట్టు చేస్తున్న ఆరోపణలు సిగ్గు చేటు అని అన్నారు. ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడితే సంతోషించాల్సింది పోయి విమర్శించటం ఆయనకు తగదని అన్నారు.దళితబంధుతో ఎందుకంత ఉలికిపాటన్నారు. దళితులను ఆదుకోవడం వారికి ఇష్టం లేదన్నారు. అందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు.