బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌లో దారుణం

మానవత్వం మరచిన ఆస్పత్రి సిబ్బంది

పోస్ట్‌మార్టమ్‌ కోసం అంబులెన్స్‌ నిరాకరణ

భోపాల్‌,జూలై11(జ‌నం సాక్షి): మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు మధ్యప్రదేశ్‌ లోని ఓ ఆస్పత్రి సిబ్బంది. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక తల్లి శవాన్ని బైక్‌ పై కూర్చోబెట్టుకొని తీసుకెళ్లాడు ఆమె కుమారుడు. మధ్యప్రదేశ్‌ లోని మస్తాపూర్‌ కు చెందిన కున్వర్‌ భాయ్‌ అనే మహిళ గత ఆదివారం పాముకాటుకు గురైంది. ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిందిగా సూచించారు. అందుకోసం అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని మృతురాలి కుమారుడు సిబ్బందిని కోరాడు. కానీ సిబ్బంది అందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక తన బైక్‌పై తల్లి శవాన్ని 35 కిలోవిూటర్ల దూరంలో ఉన్న పోస్టుమార్టం సెంటర్‌కు తరలించాడు. ఈ ఘటనను స్థానిక ప్రజలు వీడియో తీసి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ గా మారింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ స్పందించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.