బిజెపి విమర్శలపై మండిపడ్డ టిడిపి
ఎపి ప్రయోజనాలను కన్నా పణంగా పెట్టరన్న కళా
కన్నా ఎక్కడ గెలిచయినా గుండు కొట్టించుకుంటానన్న బుద్దా
అమరావతి,జూన్11(జనం సాక్షి): బిజెపి విమర్శలను టిడిపి తిప్పికొట్టింది. బిజెపిలో ఎందుకూ కొరనగాని వారు సైతం విమర్శలు చేస్తున్నారని మండిపడింది. టిడిపిపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తేనే రాజకీయాలని కన్నా భావిస్తున్నారని, ఎపి ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిపోయి తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం ధర్నాలు, ఇంటింటికీ తిరిగే కార్యక్రమాలను బిజెపి చేపడుతోందని ప్రశ్నించారు. పసలేని ఆరోపణలు చేస్తున్న ఆ పార్టీ నేతలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. విభజన హావిూలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తున్న తమపైనే కన్నా విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. కన్నా లక్ష్మీనారాయణకు డిపాజిట్ వస్తే నేను గుండుగీయించుకుంటానని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కన్నాపై పోటీకి తాను సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. కన్నా తన అక్రమాస్తులను కాపాడుకోవడానికే బీజేపీలోకి వెళ్లారని ఆరోపించారు. విభజన హావిూలన్ని నేరవేర్చిన తర్వాతే బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. విజయవాడలో బీజేపీనేతల ధర్నా అధర్మమని, అందుకే తాము కూడా నిరసన తెలిపామని బుద్దా వెంకన్న చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గోకరాజు గంగరాజు,మాణిక్యాలరావు ఈ ధర్నాలో పాల్గొన్నారు.