బిడ్డకు జన్మనిచ్చిన న్యూజిలాండ్‌ ప్రధాని

అధికారంలో ఉండి తల్లైన రెండో దేశాధినేత
ఆక్లాండ్‌ , జూన్‌21(జ‌నం సాక్షి) : న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్‌ పండంటి పాపాయికి జన్మనిచ్చారు. ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో ఆమెకు పాప జన్మించింది. దీంతో అధికారంలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో దేశాధినేతగా జెసిండా పేరు గడించారు. కొత్తగా తల్లిదండ్రులైన వారంతా ఏవిధంగా భావోద్వేగానికి గురువుతారో మేము కూడా ప్రస్తుతం మేమూ అలాగే ఉన్నాం.. మాకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు అని 37ఏళ్ల జెసిండా ఓ ప్రకటన ద్వారా తెలిపారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. పాప 3.31కిలోలు ఉన్నట్లు తెలిపారు. జెసిండా గత ఏడాది అక్టోబరులో న్యూజిలాండ్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు. జనవరిలో తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించారు. ఇది ఆమెకు మొదటి సంతానం. పదవిలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన తొలి న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆమె రెండో వ్యక్తి. 1990లో పాకిస్థాన్‌ ప్రధాని బెనజీర్‌ బుట్టో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే బుట్టోకు అంతకుముందు ఓ బాబు ఉన్నాడు. 1990లో పాపకు జన్మనివ్వగా… ఆ తర్వాత మరో పాప జన్మించింది.