బిల్లుల ఆమోదానికి సహకరించండి

4

– అఖిలపక్షంలో ప్రధాని మోదీ

ఢిల్లీ ,జులై 17(జనంసాక్షి): పెండింగ్‌ లో ఉన్న బిల్లుల ఆమోదానికి సహకరించాలని కేంద్రం ప్రతిపక్షాలను కోరింది. ప్రధాని మోడీ అధ్యక్షతనలో అఖిలపక్ష సమవేశం జరిగింది. రేపటి నుండి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జీఎస్టీ బిల్లు గురించి ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బిల్లు దేశానికి ఎంతో కీలకమని, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే అన్ని బిల్లుకు సహకరిస్తామని కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ పేర్కొన్నారు. అయితే జీఎస్టీ బిల్లును కాంగ్రెస్‌..బీజేపీ నిర్ణయించలేవని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ బిల్లుపై రెండేడ్లుగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కీలకమైన గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (జీఎస్టీ) బిల్లుకు మద్దతివ్వాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడారు. ఏ ప్రభుత్వానికి లాభం చేకూరిందన్న అంశం కన్నా జాతి ప్రయోజనాలు ముఖ్యమని మోదీ ఈ సందర్భంగా అన్నారు. జీఎస్టీతో పాటు ఇతర ముఖ్యమైన బిల్స్‌ను వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నామని, అర్థవంతమైన చర్చలు జరిగి అవి పాసవుతాయని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు. మనం పార్టీలు, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం.. జాతి ప్రయోజనాలే మనకు ముఖ్యం. మిగతావన్నీ తరువాతే అని ఆయన అన్నారు.జీఎస్టీపై రాష్ట్రాలు, కేంద్రం మధ్య సయోధ్య లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్తారని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ ప్రశ్నించారు. ఇందులో ఇమిడి ఉన్న మూడు వివాదాస్పద అంశాలను కేంద్ర ఎలా పరిష్కరిస్తుందో మాకు తెలియాలి. అందుకోసం జీఎస్టీపై పూర్తిస్థాయి ముసాయిదా ప్రతిపాదని మాకు కావాలి అని మరో కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. పన్ను రేటును 18 శాతానికి పరిమితం చేయాలనడంతోపాటు పలు కీలక సవరణలు సూచిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. అయితే భవిష్యత్‌లో మళ్లీ సవరణ చేయాల్సిన అవసరం తలెత్తకుండా పన్ను రేటును పరిమితం చేయాలని అనుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది.