బిసిలను గుర్తించి అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే
టిఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యం: మధుసూధనాచారి
భూపాలపల్లి,అక్టోబర్25(జనంసాక్షి): జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు, దాని ఉపకులాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ మధుసూధనాచారి చెప్పారు. బీసీల్లో ఎక్కువ శాతం చేతివృత్తిపైనే ఆధారపడి ఉండే కులాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కులవృత్తులకు పూర్వవైభవం తీసుకరావడానికి కృషి చేశారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజధానిలో రూ.72కోట్లతో బీసీల్లోని అన్ని కులాలకు సంబంధించిన భవనాలను నిర్మిస్తున్నామని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే కుల సంఘాలకు గుర్తింపు అన్నారు. గత పాలకులు బీసీ కులాలను ఉప కులాల ప్రజలను ఓటు బ్యాంకు కోసం వాడుకున్నారే తప్ప వారి గురించి ఆలోచించిన పాపాన పోలేదని ఆరోపించారు. గ్రామాలు అభివృద్ధి జరగాలంటే ప్రజలంతా ఏకమై టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. వివిధ పార్టీల వారు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలోని చివరి గ్రామంలోనూ అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ఎన్నో ఏండ్లుగా జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే జరిగిందన్నారు. అంతేకాకుండా ప్రతీ పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు భారీగా జరిగాయన్నారు. గ్రామాలు, తండాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పేద ప్రజల కళ్లల్లో ఆనందం చూడటం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని వివరించారు.