బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, హెచ్‌ఆర్డీ కేంద్రానికి భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల్లో నిర్మిస్తున్న భారీ భవన నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కే కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలె యాదయ్య, పార్టీ నేతలు పాల్గొన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్‌ఎస్.. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అన్ని హంగులతో అత్యాధునిక పరిశోధన, శిక్షణా సంస్థను ఏర్పాటుచేస్తున్నది. రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమస్త, సమగ్రమైన సమాచారం లభించే కేంద్రంగా ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్’ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. మొత్తం 15 అంతస్థుల్లో భవనాన్ని నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.
పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రందేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించే కేంద్రంగా దీనిని తీర్చిదిద్దనున్నారు. పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం, రాష్ర్టాలవారీగా, రంగాలవారీగా వివరాలను సమీకరించడం, వాటిని క్రోడీకరించడం వంటివి ఇక్కడ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేయనున్నారు.
శిక్షణకు వచ్చేవారు బస చేసేందుకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా ఉంటాయి. దేశంలోనే అత్యంత పేరున్న సంస్థల్లో పనిచేసిన కొందరు సీనియర్లను శిక్షణ, పరిశోధన కార్యక్రమాల కోసం నియమించనున్నారు. రిటైర్డ్ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్ నిపుణులుగా నియమించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు, మంత్రులు, హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు పంపించారు.