బీజేపీపై తెదేపా దుష్పచ్రారం సరికాదు 

– పోలవరం నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్దితో ముందకెళ్తుంది
– ముంపు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే
– 1935కోట్ల పెండింగ్‌ బిల్లుల నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదు
– స్టీల్‌ప్లాంట్‌  నిర్మాణంపై ఎన్నిసార్లు నివేదికలు అడిగినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు
– తిరిగి కేంద్రాన్ని దోషింగా చూపేందుకు దీక్షలా?
– బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి
విజయవాడ,జూన్‌26(జ‌నం సాక్షి): భారతీయ జనతా పార్టీ పోలవరం ప్రాజెక్టుకు సహకరించలేదని టీడీపీ దుష్పచ్రారం చేస్తోందని, ఇది సరైంది కాదని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో మంగళవారం మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పోరలవరం నిర్మాణానికి చిత్తశుద్దితో ముందుకెళ్తుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే దుష్పచారం చేస్తుందని, ఇది ఎంత వరకు సబబని పురందేశ్వరి ప్రశ్నించారు. పోలవరం బిల్లులు ఇంకా అందలేదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందన్నారు. పోలవరానికి 1935 కోట్ల పెండింగ్‌ బిల్లులకు సంబంధించిన నివేదిక ఇంకా కేంద్రానికి అందలేదని పురందేశ్వరి స్పష్టం చేశారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఆంధ్రాలో కలపమని కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు బిల్లులో పెట్టలేదని, అందుకే నేను కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశా అన్నారు. పోలవరం కోసం ఏడు మండలాలను ఏపీలో కలిపింది బీజేపీనే అని పురందేశ్వరి గుర్తు చేశారు. ప్రాజెక్టు కోసం బీజేపీ చిత్తశుద్దితో పని చేస్తోందని, కేంద్రం సిమెంట్‌ రోడ్లు, 24 గంటలు కరెంట్‌ ఇస్తే వాటిని చంద్రబాబు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కడప ఉక్కుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై ఎన్నిసార్లు నివేదిక అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వనంటుందని దీక్షలకు దిగడం, ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. ¬దాకు బదులు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారని, అందుకే కేంద్రం ప్యాకేజీకి ఒప్పుకుందని అన్నారు. మళ్లీ చంద్రబాబు మాటమార్చి ¬దానే కావాలంటూ బీజేపీని ద్రోహింగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు. జమిలీ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన బీజేపీకి గట్టిగా ఉందన్నారు. జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమేనని పురందేశ్వరి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలపై టీడీపీ తమపై అభాండాలు వేయడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకొన్నారని, వారికి మంత్రి పదవులు ఇచ్చారని, దానిపై ఎందుకు చంద్రబాబు మాట్లాడడం లేదని పురందేశ్వరి ప్రశ్నిచారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సక్రమ మార్గంలో కేంద్రంతో సంప్రదింపులు చేస్తే మేలు జరుగుతుందని, అలా కాకుండా ప్రయత్నాలు చేయకుండా కేంద్రం సహకరించడం లేదని అనడం సరికాదని సూచించారు.
——————————-