బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ఖర్మ

– మోదీకి ప్రధానిగా ఉండే అర్హత లేదు
– దీక్షలతో ఉక్కు కాదు.. కదా తుక్కు కూడా రాదు
– అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి
కడప,జూన్‌22(జ‌నం సాక్షి ) : బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు శుక్రవారం జేసీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏం తక్కువవాడు  కాదని.. నాటకాలడటం, డ్రామాలు ఆడించడం, మాటలు చెప్పడం, కుయుక్తులు పన్నడం అన్నీ తెలుసునంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అందుకే ప్రధాని నరేంవ్ర మోదీ రాష్ట్రానికి ఏవిూ చేయట్లేదని జేసీ అన్నారు. సీఎం రమేష్‌కు పిచ్చిపట్టి దీక్ష చేస్తున్నారని, ఇలాంటి దీక్షల వల్ల ఉక్కు పరిశ్రమ కాదు కదా.. తుక్కు పరిశ్రమ కూడా రాదని విమర్శించారు. దీక్షలో నిజాయితీ లేదని, మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని, రాష్ట్రానికి ప్రధాని ఏవిూ చేయరని విమర్శించారు. గుజరాత్‌ సీఎంగా ఉండగా ఒక వర్గాన్ని హత్యలు చేసిన మోదీ.. ప్రధానిగా ఉండటానికి అర్హత లేదన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని జేసీ ఆరోపించారు. గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా ఉన్నప్పుడు వారిపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే వారని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ హయాంలో పోలీసులన్నా, లాఠీలన్నా ప్రజల్లో భయం లేకుండా పోయిందని అన్నారు. ఇదిలావుండగా జేసీ చంద్రబాబు, సీఎం రమేష్‌పై చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం నేతలు ఖంగుతిన్నారు. సొంత పార్టీ నేతలపైనే జేసీ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, తెలుగు తమ్ముళ్లు ఒక్కసారి అవాక్కయ్యారు.