బీజేపీ, వైసీపీ కుట్రలను..
ప్రజల్లోకి తీసుకెళ్లండి
ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బుగ్గన భేటీ.. రెండు పార్టీల కుట్రలకు పరాకాష్ట
బీజేపీని జగన్ ఎందుకు విమర్శించడం లేదో ప్రజలకు తెలుసు
నిధుల అంశంలో కేంద్రాన్ని నిలదీయండి
ఎంపీలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలి
వారానికో కార్యక్రమం నిర్వహించండి
పొత్తుతో సాధించలేనిది.. పోరాటంతో సాధించుకుందాం
ఎంపీలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
అమరావతి, జూన్15(ఆర్‌ఎన్‌ఎ) : ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో బుగ్గన భేటీ రెండు పార్టీల కుట్రలకు పరాకాష్ట అని, బీజేపీ, వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం ఎంపీలతో, మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 17న జరగనున్న నీతి అయోగ్ సమావేశం, ఏపీకి జరిగిన అన్యాయం, కుట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో వారానికో కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పొత్తుతో సాధించలేనిది, పోరాటంతో సాధించాలని పిలుపునిచ్చారు. పోరాటంలో ప్రతి నిమిషం అమూల్యమన్న చంద్రబాబు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఏమరపాటు తగదని దిశానిర్దేశం చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీ సీఎం రమేష్ చేపట్టే దీక్షను విజయవంతం చేయాలని, ఎంపీలంతా కడప వెళ్లి సంఘీభావం తెలపాలని సూచించారు. కడప తర్వాత విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఉద్ధృతం చేయాలన్నారు.భాజపా, వైకాపా కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ఢిల్లీ వెళ్లి భాజపా పెద్దలతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ కావడం.. వైకాపా, భాజపా కుట్రలకు పరాకాష్ట అని చంద్రబాబు అన్నారు. సీఎంవోలో విజయ్‌సాయిరెడ్డి తిష్టవేయడంపై గతంలో ఫోటోలు వచ్చాయని, ఇప్పుడు దిల్లీలో బుగ్గన, ఆకులతో కలిసి వెళ్లడంపై వీడియోలు కూడా వచ్చాయని అన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాజాపా అడక్కుండానే వైకాపా భేషరతుగా మద్దతు పలకడాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350కోట్ల రూపాయలు వెనక్కి తీసుకోవడంపై కేంద్రాన్ని నిలదీయాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసించాలని సూచించారు. రాజధాని అమరావతికి నిధులు విడుదలయ్యేలా ఒత్తిడి చేయాలన్నారు. చట్టంలో 18అంశాలు, 6 హావిూలు నెరవేర్చేదాకా పోరాడాలన్నారు. ఎన్టీఆర్‌తో పెట్టుకుని ఇందిరాగాంధీ చేతులు కాల్చుకున్నారని.. కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడం తెదేపాకి కొత్తేవిూ కాదన్నారు. ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే ఇందిర కుట్రలను సమర్ధంగా ఎదుర్కొన్నామని ఇప్పుడు భాజపా కుట్రలను కూడా అదే స్ఫూర్తితో అధిగమిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, 5కోట్ల ప్రజల హక్కులను పరిరక్షించాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.