బీడీ కార్మికుల సమస్యలపై స్పందించండి

నిజామాబాద్‌,ఏప్రిల్‌15: బీడీ కార్మికుల పొట్టగొట్టేలా బీడీ పరిశ్రమను చిన్నాభిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని  తెలంగాణ బీడీ కార్మిక సంఘం నాయకులు అన్నారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. మూతపడ్డ బీడీ  కంపెనీలను తెరిపించి, కార్మికులకు పనికల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీడీ కట్టలపై 85శాతం పరిమాణంలో గొంతు క్యాన్సర్‌, పుర్రె బొమ్మలను, బీడీ ప్యాకింగ్‌, గడువు తేదీలను ముద్రించాలని 727 జీవోను జారీ చేయడంతో కంపెనీలు మూతవేశాయన్నారు. దీంతో కార్మికులు పనులు లేక పస్తులుండాల్సి వస్తోందన్నారు. దీనిపై నిజామాబాద్‌ ఎంపి కేంద్రం దృష్టికి తీసుకుని పోయినా పట్టించుకోవం లేదన్నారు.  తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బీడీ కంపెనీలను తెరిపించి కార్మికులను ఆదుకోవాలన్నారు. అదేవిధంగా, కార్మికులు పోరాడి సాధించుకున్న జీఓ 41 ప్రకారం కనీస వేతనాలను అమలు చేయాలని, షరతులు లేకుండా కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై కోటీ 50 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీరంతా రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందన్నారు. దీన్నే సాకుగా తీసుకొని బీడీ కంపెనీల యజమాన్యాలు ఏప్రిల్‌ 1 నుంచి అప్రకటితంగా బీడీ కార్ఖానాలను బంద్‌ చేయడంతో రోజుకు వంద కోట్ల ఉత్పత్తి నిలిచిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడగా, బీడీ కంపెనీలు బంద్‌ కావడంతో ఉపాధి కోల్పోతున్నారన్నారు.