బీమాతో రైతులకు ఊరట

కర్నూలు,జూన్‌22(జ‌నం సాక్షి ): గత రెండు, మూడేళ్లుగా జిల్లా రైతాంగం నష్టపోయినప్పటికీ కాస్తో, కుస్తో వచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోతున్నారు. బీమా కల్పించి రైతులను రెండు కారులు పంటలు సాగు చేసుకునేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా రైతాంగానికి ఊరట కలిగించిందని చెప్పక తప్పదు. మొదట్లో ఒక పంటకే ఇన్సూరెన్స్‌ చెల్లించేవారు. రెండవ పంట సాగు వ్యవహారంలో వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు ఏ పంటకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదీ ఆయా ప్రాంతాల్లోని సాగును బట్టి బీమాను అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం వల్ల రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. దీనిని వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పసల్‌ బీమా యోజనను అందరికి వర్తింప చేయాలని ఇటీవల సిఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని పసల్‌ బీమాతో రైతులకు ఊరట కలిగించాలని ఆదేశించారు. జిల్లాలో మొదటి పంటగా వేరుశనగ సాగవుతోంది. ఆయా ప్రాంతాలను బట్టి రెండవ పంట కింద రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. కేసీ కెనాల్‌ బెల్టు కింద వరి పంట రెండవ పంటగా ఉండగా మిగతా ప్రాంతాల్లో ప్రొద్దుతిరుగుడు, పసుపు వంటి ఇతర రకాల పంటలు సాగులో ఉన్నాయి. అయితే గతంలో పాలకులు, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల రెండవ పంటకు ఇన్సూరెన్స్‌ అమలు కాలేదు. అయితే జిల్లాలో రెండవ పంటగా వరి పంటకు గుర్తింపు ఇచ్చారు. ఈ పంట సాగులో కేసీ కెనాల్‌ ఆయకట్టు- పరిధిలోని ఈ పంట అధికంగా సాగవుతోంది. రెండవ పంటకు కూడా ఇన్సూరెన్స్‌ చెల్లించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించడంతో జిల్లా రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తాయి. ప్రధానంగా రెండు రకాల పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించడానికే ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పడిన కరవు నేపథ్యంలో రాష్ట్ర రైతాంగం భారీగా కడగడ్ల పాలైంది. దీంతో రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఏడాది ఖరీఫ్‌ నుంచి రెండవ పంటకు కూడా బీమా ఇవ్వాలని వ్యవసాయ శాఖ తీసుకున్న నిర్ణయం తెలిసిందే.