బీసీ జనాభా తగ్గింది
` ‘స్థానిక’ ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం కుట్రలు
` ఖమ్మం జిల్లా భారాస నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్
ఖమ్మం(జనంసాక్షి): పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు.ఆ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత భారాస ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని, పువ్వాడ అజయ్ వంటి మంచి నాయకుడు ఓడిపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా భారాస నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు.’’తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చింది. జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సవిూకరణాల వల్ల భారాసకు నష్టం జరిగింది. ఓడిపోయినా కూడా ప్రజలకు కష్టం వస్తే భారాస నాయకులు, శ్రేణులు ఏడాది కాలంగా ప్రజలకు అండగా ఉంటున్నారు. ఖమ్మంలో ఇటీవల వరదలు వస్తే ప్రజలకు పువ్వాడ అజయ్ గుర్తుకొచ్చారు. డిప్యూటీ సీఎం సహా ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ వరదల సమయంలో వారితో పైసా ఉపయోగం లేదు. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామన్న భావనతో ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్దిచెప్పాలి. ఏడాది కాలంగా కేసులు పెట్టి వేధిస్తున్నా.. విచారణల పేరిట పిలిచి జైల్లో పెడతామని బెదిరిస్తున్నా ప్రజా సమస్యలపై రేవంత్‌రెడ్డితో పోరాడాం. భవిష్యత్తులో కూడా కొట్లాడతాం. త్వరలోనే ఖమ్మంలో పర్యటిస్తా’’అని కేటీఆర్ తెలిపారు.