బీసీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ

జిల్లా సహాయ బీసీ అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి
వీపనగండ్ల సెప్టెంబర్ 20 (జనంసాక్షి) విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సహాయ బిసి అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం వీపనగండ్ల మండల కేంద్రంలోని బిసి బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాల పరిశీలించి రుచి చూశారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా నాణ్యమైన  రుచికరమైన వేడి భోజనం పరిశుభ్రమైన తాగునీరు అందించాలని అన్నారు. అనంతరం విద్యార్థుల చేత ప్రార్థన చేయించి ఆయన మాట్లాడుతూ వసతి గృహం ఆవరణ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని విద్యార్థులకు సూచించారు.  హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని, వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య పెంపునకు కృషి చేయాలని వసతి గృహ సంక్షేమ అధికారిని కోరారు. విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు.  విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని వాటిని ఉన్నతాధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి ఆర్. మనోహర్ నాలుగో తరగతి సిబ్బంది నాగయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.