బీసీ వసతి గృహాలకు అధిక నిధులు
శ్రీకాకుళం, జూన్ 24 : జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. గడిచిన ఏడు నెలలుగా వసతి గృహాల విద్యార్థుల మెస్ చార్జీలు విడుదల కాక, అప్పులలో సతమతమవుతున్న ఆ శాఖ సంక్షేమ అధికారులకు వూరట ఇచ్చే విధంగా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసింది. జిల్లాలో ఉన్న 82 బిసి వసతి గృహాలకు విద్యార్థుల మెస్ చార్జీలను గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో ఒక్కో వసతి గృహ సంక్షేమ అధికారి విద్యార్థుల సంఖ్యను బట్టి రూ. 3 లక్షల నుంచి 4 లక్షల వరకు సరుకుల పంపిణీదారులకు బకాయిలు పడ్డారు. నెల రోజులుగా వ్యాపారులు సైతం అప్పు ఇచ్చేందుకు నిరాకరించడంతో విద్యార్థులకు భోజనం పెట్టేందుకు సంక్షేమాధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఏప్రిల్ నుంచి సరఫరా చేయకపోవడంతో వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జిల్లా కలెక్టర్ జి. వెంకట్రామిరెడ్డి సైతం వసతి గృహాల మెస్ చార్జీల బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.7.58 కోట్లు మెస్ చార్జీల కింద విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు మొత్తం పరిష్కారం కావడంతో పాటు వచ్చే ఏడాది (2013) మార్చి వరకు అవసరమైన బిల్లుల నిధులు సైతం వారి చేతిలో ఉన్నట్లు అయింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల బిసి వసతి గృహ సంక్షేమాధికార సంఘం జిల్లా అధ్యక్షుడు సత్తారు ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు.