బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం
హైదరాబాద్‌, (జనంసాక్షి) :
హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను బీహార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఆలమ్‌, సోమాలియాకు చెందిన అబ్దుల్లా అనే ఇద్దరిని బీహార్‌లోని చంపారన్‌ జిల్లా రక్సాల్‌ వద్ద సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి వద్ద సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చెందిన కొన్ని ఫొటోలు లభించినట్లు తెలిసింది. సోమాలియాకు చెందిన అబ్దుల్లా వద్ద వీసా, పాస్‌పోర్టు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. వీరికి హైదరాబాద్‌ బాంబు పేలుళ్లతో ఏమైనా సంబంధం ఉందా అన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎన్‌ఐఏ అధికారులు స్థానిక పోలీసుల వద్ద సమాచారం సేకరించినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ ఆలమ్‌కి సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.