బీహార్‌ బస్సు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు

– మాటమార్చిన మంత్రి 
పట్నా, మే4(జ‌నం సాక్షి): బిహార్‌లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోతిహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో బస్సులో మంటలు వ్యాపించి దాదాపు 27 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ కేసులో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. ప్రమాదం జరిగిన మాట నిజమే గానీ ఎవరూ చనిపోలేదని బిహార్‌ మంత్రి దినేశ్‌ చంద్ర యాదవ్‌ వెల్లడించారు. ఇంకో విషయమేంటంటే.. ప్రమాదంలో 27 మంది మృత్యువాతపడ్డారన్న విషయాన్ని విూడియా ముందుకు వెల్లడించింది ఆయనే కావడం గమనార్హం. పైగా బస్సు పూర్తిగా కాలిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. ఈ ఘటనపై గురువారం బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ సంతాపం వ్యక్తం చేశారు. మరోపక్క ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 13 మంది ప్రయాణికులు, డ్రైవర్‌, సహాయకుడు మాత్రమే ఉన్నారని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. మొత్తం 32 మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకున్నారని, వీరిలో 13 మంది మాత్రమే ముజఫర్‌పూర్‌లో ఎక్కారని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే ప్రమాదంలో గాయపడ్డ ఎనిమిదిమందిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించటం జరిగిందని
మంత్రి తెలిపారు. మరో ఐదుగురి జాడకూడా తెలియలేదని మంత్రి తెలిపారు. వాళ్ల మృతదేహాలుకూడా కనిపించలేదని, వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బస్సుప్రమాదంలో ప్రభుత్వం వద్ద స్పష్టత లేకపోవటం ఆశ్చర్యమేస్తుందని, మంత్రి రోజుకోలా మాట్లాడటం ప్రభుత్వం పనితీరుకు అర్దం పడుతుందని ప్రతిపక్ష పార్టీ నేతలు, ప్రజలు విమర్శలు చేస్తున్నారు.