బుర్హన్‌ హత్యపై నవాజ్‌ దిగ్బ్రాంతి

2

ఇస్లామాబాద్‌ జులై11(జనంసాక్షి):

ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. ఉగ్రవాది, హిబ్బుల్‌ ముజాహిదీన్‌ నేత బుర్హాన్‌ వానీని భారత్‌ హతమార్చడం తమను షాక్‌కుగురిచేసిందని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భారీఎత్తున బలగాలను మోహరించి ఆందోళనకారులను అణచివేయడంపై కూడా నిరసన వ్యక్తం చేశారు. బుర్హాన్‌ హత్యపై షరీఫ్‌ ఏవిూ మాట్లాడకపోవడాన్ని అక్కడి ప్రతిపక్ష నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. కశ్మీరీ నేత బుర్హాన్‌ హత్యపై పాక్‌ ప్రధాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు.. అక్కడి పౌరులను భారత మిలిటరీ, పారామిలిటరీ బలగాలు అన్యాయంగా చంపడాన్నికూడా నిరసించారు అని షరీఫ్‌ కార్యాలయ వర్గాలు ఆ ప్రకటనలో వెల్లడించాయి. ఇలాంటి అణచివేత ధోరణులతో కశ్మీరీ ప్రజల ఆకాంక్షను అడ్డుకోలేరని షరీఫ్‌ అన్నారు. వేర్పాటువాద నేతల నిర్బంధాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. మానవ హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని షరీఫ్‌ అన్నారు. మరోవైపు పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో కూడా భారత ఆర్మీ తీరుపై మండిపడ్డారు. షరీఫ్‌-మోదీ స్నేహం కశ్మీర్‌ అంశాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచమంతా ముస్లింలు రంజాన్‌ పండుగ జరుపుకుంటుంటే కశ్మీర్‌లోని మన సోదరులు మాత్రం భారత ఆర్మీ హింసకు గురయ్యారని బిలావల్‌ అన్నారు.