బూటకపు వాగ్దానాలతో మభ్య పెడుతున్న కెసిఆర్
మెదక్,అక్టోబర్4(జనంసాక్షి): సీఎం కేసీఆర్ బూటకపు వాగ్దానాలు చేస్తూ పాలన సాగిస్తున్నారని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హావిూలను తుంగలో తొక్కడమే గాకుండా గ్రామాల్లో ప్రజాప్రతినిధులను విగ్రహాలుగా మార్చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలతో అయినా సిఎం కెసిఆర్‌కు కనువిప్పు కావాలన్నారు. తెరాస ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు చరమగీతం
పాడాల్సి ఉందని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసేలా ఉండాలి కాని, ఇబ్బందులకు గురిచేసేవిగా ఉండరాదని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదన్నారు. స్వరాష్ట్రంలోనూ రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సక్రమంగా సాగలేదని, అంతే కాకుండా అర్హులైన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు అందని పరిస్థితి ఉందని అన్నారు. తమ భూములపైనే తమకు హక్కు లేకుండా పోయిందనే ఆందోళనలో రైతులు ఉన్నారని పేర్కొన్నారు. భూములను కాపాడుకునేందుకు రైతులు తరతరాలుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వాన్ని నడిపి పరిష్కారం చూపడానికే కాని మోసం చేయడానికి కాదన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, హక్కుల సాధనకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూములు అందిస్తామన్న హావిూలను ఇంతవరకు నెరవేర్చలేదన్నారు.


