బెంగాల్‌లో బాంబు కలకలం

రైల్వే స్టేషన్‌ ముందు బాంబు గుర్తింపు
కోల్‌కతా,ఆగస్ట్‌16(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో రైల్వేస్టేషన్‌ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వేస్టేషన్‌ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక రైల్వే పోలీసులు సీఐడీకి సమాచారం అందించారు. సీఐడీకి చెందిన బాంబు డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ అక్కడికి చేరుకొని బాంబును నిర్వీర్యం చేసింది. బాంబు దేశీయంగా తయారు చేసిందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని న్యూ జల్పాయిగురి స్టేషన్‌ రైల్వే పోలీస్‌ ఫోర్స్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఏజీ ఫరూఖ్‌ పేర్కొన్నారు. భయాందోళనలు సృష్టించాలనే లక్ష్యంతో రైల్వేస్టేషన్‌ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. బాంబు ఘటనతో భద్రతా ఏర్పాట్లు పెంచి, రైల్వేస్టేషనులో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బాంబు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్‌ రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు చెప్పారు.

తాజావార్తలు