బెంగాల్‌లో హింసపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కల్‌కత్తా హైకోర్టు


కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్‌ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో హత్యలు, అత్యాచారం వంటి ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని, ఇతర నేరాలపై దర్యాప్తునకు ప్రత్యేక సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ బృందంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌ సౌమెన్‌ మిత్రా, ఐపీఎస్‌ అధికారులు సుమన్‌ బాలా సాహో, రణ్‌వీర్‌ కుమార్‌ సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ఈ రెండు దర్యాప్తులను కోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం తెలిపింది. వచ్చే ఆరు వారాల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కేసులకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అప్పగించాలని సూచించింది. ఈ ఏడాది మార్చి – ఏప్రిల్‌లో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 2న ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అయితే, ఫలితాల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని, ఆ అల్లర్లలో కొందరు మహిళలపై అకృత్యాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆరోపణలపై దర్యాప్తు జరిపి గత నెల 15న కోర్టుకు నివేదిక సమర్పించింది. ఎన్నికల అనంతరం హింస చెలరేగిన మాట వాస్తవమేని, అధికార పార్టీ కార్యకర్తలు.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపారని పేర్కొంది. మహిళలపై అత్యచారాల వంటి నేరాలు కూడా జరిగినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని సిఫార్సు చేసింది. దీంతో నేడు కోర్టు ఈ దర్యాప్తును సీబీఐ అప్పగించాలని ఆదేశించింది. కాగా.. కోర్టు తీర్పుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భాజపా మాత్రం కోర్టు తీర్పును స్వాగతించింది.