బైకు దగ్ధం కేసులో నలుగురిపై హత్యాయత్నం కేసు
జనం సాక్షి జోగుపేట్ ఆందోల్ గత మూడు రోజుల క్రితం
సంగారెడ్డి జిల్లా సంగుపేట వద్ద జాతీయ రహదారిపై ఈ నెల 5న జరిగిన బైకు దగ్ధం ఘటనలో న లుగురిపై హత్యయత్నం కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన బైకు ర్యాలీ సమయంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నీరుడి దుర్గేష్‌తో పాటు మరో ఇద్దరికీ గాయాలు కాగా, బైకు దగ్ధం అయ్యింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని, వారిపై హత్యయత్నం కేసు నమోదు చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించి, రాస్తారొకోను చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. దీంతో జోగిపేట పోలీసులు అందోలు–జోగిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తుడుం రాములు, ఏర్రారం మాజీ సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డిలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు చంద్రశేఖర్, ఎం.అనిల్ కుమార్‌లపై హత్యయత్నం కింద 341, 307, 324, 435, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సామ్యానాయక్ వెల్లడించారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపించామని, పరారీలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి కోసం గాలిస్తున్నామన్నారు.