బొగ్గునూ బొక్కేశారు !
యూపీఏ సర్కార్ మరో కుంభకోణం చక్రంలో ఇరుక్కుంది. ఇప్పటికే అవినీతి మరకలు అంటుకున్న యూపీఏ ప్రభుత్వానికి ఈసారి బొగ్గు మసి అంటుకుంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో లక్షా 86 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించి సంబంధిత ఫైళ్లను పార్లమెంట్‌లో పెట్టింది. ఈ ఫైల్ శుక్రవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. దేశానికి అత్యంత ఆదాయాన్ని ఇచ్చే ఈ శాఖను సాక్షాత్ ప్రధాని మన్మోహన్‌సింగ్ చూస్తున్నారు. ప్రపంచీకరణలో భాగంగా కీలక రంగాల్లోకి ప్రైవేటు సంస్థలు విచ్చలవిడిగా చొరబడుతున్నాయి. వాటి పెత్తనానికి, ప్రభావానికి ప్రభుత్వాలు కూడా తలవంచక తప్పడంలేదు. అందుకే ఈ ఎనిమిదేళ్ల కాలంలో 142 బొగ్గు బ్లాక్‌లను కేటాయించగా, ఇందులో 67 బ్లాక్‌లను ప్రభుత్వ సంస్థలకు కేటాయించారు. మరో 8 అదనంగా ఇస్తూ మొత్తం 75 బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారు. లాభాపేక్షతో పని చేసే ప్రైవేటు సంస్థలు ధరలు విపరీతంగా పెంచేసి తమ ఖజానాలు నింపుకున్నారు. ఈ కేటాయింపులతో కోల్ ఇండియా తవ్వకం జరుపుతున్న బొగ్గు ధరకు, ప్రైవేటు కంపెనీలు మైనింగ్ జరుపుతున్న బొగ్గు ధరకు మధ్య ఉన్న తేడా వల్ల ప్రైవేటు కంపెనీలకు ఏకంగా లక్షా 86 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఇది 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కన్నా భారీ కుంభకోణమని ‘కాగ్’ కడిగేసింది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం కాగ్ నిర్ద్వందంగా ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను అభిశంసించడం. దీంతో కేంద్రం ఆత్మరక్షణలో పడింది. కాగ్ నివేదిక ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ, అది దాని పరిధిని అతిక్రమిస్తున్నదంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. వేలం పాటలతోనే బొగ్గు బొరియలను కేటాయించాల్సి ఉండగా, తన ఇష్టం వచ్చిన వారికి కేటాయించి, ‘అయిన వారికి ఆకుల్లోనూ, కాని వారికి కంచాల్లో పెట్టడమేందని’ కాగ్ ప్రశ్నించడం కేంద్రాన్ని కలవర పెడుతున్నది. కాగ్ సలహా తన విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనని, కాగ్‌కు ఆ అధికారం ఎవరిచ్చారంటూ ప్రభుత్వం మండిపడుతున్నది. అన్నింటికంటే ముఖ్యం కాగ్ ప్రధానిని అభిశంసించడాన్ని అస్త్రంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం ఆయన రాజీనామాకు డిమాండ్ చేయడం ఆరంభించింది. నీతిమంతుడిగా, వివాదరహితుడిగా పేరొందిన మన్మోహన్ కాగ్ రిపోర్టులోని నిజానిజాలను ప్రజల ముందుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన్మోహన్ స్వభావాన్ని ఎరిగిన వారెవరూ ఆయన అందినకాడికి దండుకుని బొక్కేసే వాడుకాదనే అంటారు. మరి రాజకీయ బీజేపీ చేసే డిమాండ్‌ను కాంగ్రెస్ ఏ మేరకు తిప్పికొట్టగలదో వేచిచూడాలి. బొగ్గు కేటాయింపులు జరిగిన సమయం నుంచి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆ శాఖను చూడకపోయినా 2004 నుంచి మన్మోహన్‌సింగ్ ప్రధాన మంత్రిగానే ఉంటున్నారు. ఆ సమయంలోనే కొంతకాలంపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జార్ఖండ్ నేత శిబూ సోరెన్ తాత్కాలికంగా బొగ్గు శాఖను చూశారు. మరి ప్రధాని ప్రమేయం లేకుండా, పట్టించుకోకుండానే బొగ్గు గనుల కేటాయింపు జరిగిందంటే ఆశ్చర్యకరమైన విషయమే. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బొగ్గు శాఖ మంత్రిగా శిబూసోరెన్ పనిచేశారు. మధ్యలో ఆయన రాజీనామా చేసినప్పటికీ 2006లో మళ్లీ అదే శాఖకు మంత్రి అయ్యారు. 2006 జూన్‌లో న్యాయ మంత్రిత్వ శాఖ గనుల జాతీయకరణ చట్టాన్ని సవరించాలని సలహా ఇచ్చేటప్పటికీ బొగ్గు శాఖ ప్రధాన మంత్రి సమక్షంలో లేదు. కాబట్టి ఈ కుంభకోణానికి ప్రధాని బాధ్యత వహించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నిరూపించడానికి నేడు తంటాలు పడుతోంది. ఏదేమైనా బొగ్గు గనులను వేలం వేయకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే 159 బొగ్గు గనులను స్వదేశీ, విదేశీ సంస్థలకు కేటాయించి వాటి జేబులను నింపేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని పూడ్చగలమా ? మన్మోహన్‌సింగ్ విధాన నిర్ణయాల వల్ల దాదాపు 50 ఏళ్లపాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరాకు ఉపయోగపడే 33,169 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసిన యూపీఏను రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారనడంలో సందేహం లేదు. దేశ ప్రజల కోసం కరెంట్‌ను ఉత్పత్తి చేసే బొగ్గును ఇలా పక్కదారి పట్టిస్తే కరెంట్ ధరలు పెరిగి ఆ భారం పడేది కచ్చితంగా సామాన్యులపైనే..