బొగ్గు కుంభకోణంలో.. 

జిందాల్‌పై కొత్త అభియోగాలు
– లంచం ఇచ్చారనే అభియోగాన్ని నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం
– తాజా అభియోగాల నుంచి దాసరికి మినహాయింపు
న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : బొగ్గు కుంభకోణంలో ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌పై లంచం ఇచ్చారనే కొత్త అభియోగాలను నమోదు చేయాల్సిందిగా దర్యాప్తు సంస్థను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. జార్ఖండ్‌లోని అమరకొండ మురుగదంగల్‌ బొగ్గు గని కేటాయింపు కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అదనపు చార్జిషీటును ప్రత్యేక కోర్టు శుక్రవారం పరిశీలించింది. నిందితులపై మోపిన అభియోగాలను ఆగస్టు 16న లాంఛనంగా కోర్టు పరిగణనలోకి తీసుకోనుంది. 2016 ఏప్రిల్‌లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణ రావు, జార్ఖండ్‌ మాజీ సీఎం మధు కోడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తతో పాటు మరో 11 మందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కుట్ర, విశ్వాపఘాతుకం, మోసం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినా.. లంచాలకు సంబంధించి ఎలాంటి అభియోగాలు లేవు. తాజాగా సీబీఐ దాఖలు చేసిన అదనపు చార్జిషీటులో లంచాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. దాసరి మృతి చెందడంతో ఆయనను తాజా అభియోగాల నుంచి  మినహాయించారు. హైదరాబాద్‌కు చెందిన నిహార్‌ స్టాక్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ఎన్‌ సూర్యనారాయణ, ఎస్సార్‌ పవర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుశీల్‌ కుమార్‌ మారో, జిందాల్‌ స్టీల్‌ అప్పటి సలహాదారు ఆనంద్‌ గోయల్‌పై తాజా అభియోగాలను మోపాల్సిందిగా సీబీఐని ప్రత్యేక కోర్టు ఆదేశించింది.