బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్
జెండావిష్కరణ సభలో నిలదీసిన తెలంగాణవాదులు
హైదరాబాద్, జనవరి 26 (జనంసాక్షి) :
పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సీమాంధ్ర నేతలు పెట్టుకున్న రాజమండ్రి సభకు ఎట్లాబోయినవంటూ తెలంగాణ వాదులు బొత్సా సత్యనారాయణను ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న బొత్సాపై తెలంగాణ నేతలు ఫైరయ్యారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని, పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ ఇంద్రాసేనారెడ్డి గాంధీభవన్‌లో బొత్సను నిలదీశారు. ఒక ప్రాంతానికి ప్రతినిధిగా వ్యవహరించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తన అభిప్రాయాలు చెప్పే హక్కుందని బొత్స అన్నారు. కానీ, డి.శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలా వ్యవహరించ లేదంటూ బొత్సతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పక్కనే ఉన్న నేతలు సర్దిజెప్పడంతో ఆయన శాంతించారు. అనంతరం బొత్స ప్రసంగిస్తుండగా, తెలంగాణ నేతలు అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీమాంధ్ర నేతలు గోబ్యాక్ అంటూ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. సీఎం కిరణ్ సమక్షంలో ఈ నిరసన చోటు చేసుకోవడం గమనార్హం. జెండా ఆవిష్కరణ అనంతరం బొత్స ఇచ్చిన అల్పాహార విందును తెలంగాణ నేతలు బహిష్కరించారు. వి.హనుమంతరావు, మంత్రి సుదర్శన్‌రెడ్డి, నర్సారెడ్డి తదితరులు అల్పాహార విందుకు దూరంగా ఉన్నారు. ఆంధ్రోళ్ల విందుకు మేం రామని తేల్చి చెప్పారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి జానారెడ్డి బొత్సను నిలదీసినట్లు తెలిసింది. పీసీసీ చీఫ్‌గా ఉండి, ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో సభకు హాజరు కావడంతో తప్పుడు సంకేతాలు వెళ్లాయని మండిపడ్డారు. అయితే, తెలంగాణవాదులు సమావేశానికి ఆహ్వానిస్తే వస్తానని బొత్స అన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కూడా బొత్సపై మండిపడ్డారు. తక్షణమే ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, పీసీసీ చీఫ్ బొత్స ఇక తెలంగాణలో తిరగలేరని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ హెచ్చరించారు. రాజమండ్రిలో జరిగిన సభకు బొత్స ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. సభలో పాల్గొనడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని, అయితే, ఆయన ఇక తెలంగాణలో తిరగలేరన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీని, డిసెంబం 9 నాటి ప్రకటనకు కట్టుబడి ఉండకపోతే కాంగ్రెస్‌కు తెలంగాణలో పుట్టగతులుండవన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతిస్తారన్నారు. అన్నదమ్ముల్లా విడిపోవడానికి సీమాంధ్ర నేతలు సహకరించకపోతే ఉద్రిక్త పరిస్తితులు ఏర్పాడతాయన్నారు. రాజ్యాంగ నియమావళిని గుర్తెరిగి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వ్యవహరించాలని సూచించారు.