బోడుప్పల్”కు కుక్కల కాటు

వరుస ఘటనలతో నిత్యం ఆందోళన
వెంటపడి మరీ స్థానికులపై దాడి చేస్తున్నవైనం
నియంత్రించడంలో మున్సిపల్ కార్పొరేషన్ విఫలం
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు మారలేదు. పాలకవర్గానికి కనీసం సోయిలేదు. ఫలితంగా బోడుప్పల్ నగరవాసులపై గ్రామసింహాలు ముప్పేట దాడి ఆగడం లేదు. బయటకెళ్ళిన వారికి “భౌభౌ”మనే శబ్దాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారిని వెంబడించిన కుక్కల ఉదంతం మరోకసారి కన్నవాళ్ళ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వివేకానంద నగర్ కాలనీలో బుధవారం రోజున మనస్విని అనే బాలికను ఆరు కుక్కలు వెంబడించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆ చిన్నారి పరుగులు పెడుతూ అదుపు తప్పి కింద పడడంతో గాయాల పాలయింది. అదే కాలనీలో పదుల సంఖ్యలో కుక్కలు సంచరించడంతో స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. బండి అటుగా వెళ్తే వాహనం వెంటే అవి పరుగులు పెట్టడం, ఈ క్రమంలో బండి నడుపుతున్నవారు అదుపుతప్పి కింద పడటం నిత్యకృత్యంగా మారింది. ఇటీవలే ఓ మహిళ ఇదే తరహాలో స్కూటీ మీదనుంచి కింద పడి తీవ్ర గాయాల పాలైంది. అంతకు ముందు నాలుగైదు ఘటనలు కూడా జరిగాయి.
చెవిలో శంఖం ఊదినట్టే..
కుక్కలు కరుస్తున్నాయి మహాప్రభో అంటూ ఎవరికి ఈ సమస్యను వివరించినా చెవిటోని చేవిలో శంఖం ఊదినట్టే మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చేతులెత్తేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ ను ఆశ్రయించినా ఫలితం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు కూడా కుక్కలను పట్టుకొని పోయే రూల్ మా దగ్గర లేదంటూ తరచూ  దాట వేయడం పరిపాటిగా మారిందనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కండ్లు తెరవాలని, కుక్కల సమస్యను తీర్చాలని వివేకానంద నగర్ కాలనీ వాసులు  కోరారు