బోనమెత్తిన హైదరాబాద్‌

5

హైదరాబాద్‌,ఆగష్టు 9(జనంసాక్షి):పాతబస్తీ బోనమెత్తుకుంది. వాడవాడన బోనాల ఉత్సవాల శోభ వెల్లివిరుస్తోంది. లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. దీంతో నిర్వహకులు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి పంపుతున్నారు. అటు సీఎం కేసీఆర్‌ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేడుకలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారిని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత దర్శించుకున్నారు. బంగారు బోనమెత్తుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు కవిత తెలిపారు. తెలంగాణలో విస్తారంగా వానలు పడాలని తెలంగాణ ఆడపడుచులంతా అమ్మవారికి మొక్కుకోవాలన్నారు. అటు లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కవిత తెలిపారు.

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు లాల్‌ దర్వాజ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అక్కన మాదన్నఆలయాన్ని సందర్శించారు. మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని కోరుకున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌ సైదాబాద్‌ లోని జయదుర్గాదేవి అమ్మవారి దేవాలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ నేతలు మందా జగన్నాథం, ఎడ్ల సుధాకర్‌ రెడ్డి, ఇతర నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. సీఎం కేసీఆర్‌ అత్యధిక నిధులు కేటాయించి ప్రభుత్వ లాంఛనాలతో బోనాలు నిర్వహిస్తున్నారని మందా జగన్నాథం చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో బంగారు తెలంగాణ సాకారం కావాలని కోరుకున్నామని చెప్పారు. జయదుర్గాదేవి అమ్మవారి దేవాలయం నిర్మాణం తర్వాత ఇది రెండో ఉత్సవమని ఆలయ ఛైర్మన్‌ కొరుడు భూమేశ్వర్‌ చెప్పారు. వర్షాలు కురవాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.