బ్యాంకాక్‌లో భారీ పేలుడు

3

– 15 మంది మృతి,  90 మందికి గాయాలు

– మోటార్‌ సైకిల్‌కు బాంబు అమర్చినట్లు అనుమానాలు

హైదరాబాద్‌ ఆగస్ట్‌17(జనంసాక్షి):

థాయిలాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్‌ బ్యాంకాక్‌లోని ప్రఖ్యాత హిందూ ప్రార్థనా ప్రదేశమైన ఎరవాన్‌ ఆలయ సమీపంలో జరిగిన పేలుడు కారణంగా 15 మంది మృతిచెందగా, దాదాపు 80 మంది గాయాలపాలయ్యారు. అక్కడ పేలింది బాంబు అని, కానీ ఏ రకం బాంబు అనే విషయం అని నిర్ధారించాల్సి ఉందని అధికారులు జాతీయ పోలీసు అధికార ప్రతినిధి ప్రవుట్‌ తవోర్న్‌సిరి తెలిపారు. మోటార్‌సైకిల్‌ కింద బాంబు అమర్చి పేల్చినట్టు పోలీసులు పేర్కొన్నారు.

పేలుడు సంభవించిన చోట వీధిలో మృతదేహాలు, మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు, అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి హుటాహుటిన తరలి వెళ్లాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే బాంబు పేలుడు ఎలా సంభవించింది.. కారణం ఎవరనే అంశం తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపడుతున్నారు. 2006లో కూడా ఈ దేవాలయం వద్ద దాడి జరిగింది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అతడిని స్థానికులు వెంటనే కొట్టి చంపేశారు. కొద్దినెలలకే మళ్లీ విగ్రహాన్ని పునర్నిర్మించారు. రోజూ వేలాది బౌద్ధులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలోనే మూడు పెద్ద షాపింగ్‌ మాల్స్‌ కూడా ఉన్నాయి.