బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలి

కడప,జూన్‌21(జ‌నం సాక్షి): ప్రభుత్వం తక్షణమే లక్షా 50వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలనేతలు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. కొత్తగా వచ్చిన పరిశ్రమలలో కొత్త ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా అర్హతను బట్టి ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. ప్రైవేట్‌ పరిశ్రమల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌చేశారు. గ్రూప్‌ 2 స్క్రీనింగ్‌ టెస్టులో రిజర్వేషన్‌ లేకపోవడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నేటికీ దళితులకు కనీస వసతులు కరువయ్యాయన్నారు. దళితుల్లో చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. రాజ్యాంగం అమలు చేయకుండా రిజర్వేషన్‌కు తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. రిజర్వేషన్‌లో కోత విధిస్తే ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. సబ్‌ప్లాన్‌ నిధులు దళితవాడలకు ఖర్చుచేయకుండా దారి మళ్లిస్తున్నారని తెలిపారు. దళితులు, గిరిజనులకు చెందిన భూములను లాక్కుంటున్నారని, ప్రభుత్వాలు మారుతున్నా దళితుల తలరాత మారడం లేదన్నారు. సంపద ఐదుశాతం మంది ప్రజల్లో ఉంటే, 95 శాతం మంది తిండికి లేక అలమటిస్తున్నారని తెలిపారు.