బ్యాక్ వాటర్ తో బతకడం ఎలా..? – అన్నారం బ్యారేజ్
బ్యాక్ వాటర్ తో ఐదేళ్లుగా నీట మునుగుతున్న వందలాది ఎకరాలు – నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మంథనిలో రోడ్డెక్కిన బాధిత రైతులు జనం సాక్షి, మంథని : బ్యాక్ వాటర్ వల్ల బలైపోతున్నామని అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ బాధిత రైతులు రోడ్డెక్కి నిరసన ఆందోళన బాట పట్టారు. పెద్దపెల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. మంథని మండలం లోని ఖాన్ సాయి పేట, ఆరింద , మల్లారం, అమ్మవారిపల్లెలకు చెందిన రైతులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకవైపున గోదావరి మరోవైపు నుండి మానేరు నదులు తమ శివారు భూముల్లోనే కలుస్తుంటాయని అయితే అన్నారం బ్యాక్ వాటర్ ఒత్తిడి కారణంగా తమ భూములను గురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది ఎకరాలు అన్నారం బ్యాక్ వాటర్ వల్ల సాగు చేసుకోలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని పంట భూములు మునిగిపోవడంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న తమకు జీవనాధారం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఆనంద మల్లారం గ్రామాల్లోని 382 ఎకరాలకు కేవలం నాలుగు సార్లు హాలిడే ప్రకటించగా కాన్సాయిపేట అమ్మగారిపల్లె గ్రామాలకు మాత్రం మూడుసార్లు మాత్రమే క్రాఫ్ హాలిడే ప్రకటించి పరిహారం ఇచ్చారన్నారు. అధికారులు వెంటనే ఐదేళ్లలో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు తమ భూములను తీసుకొని మెరుగైన నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ ధర్నా వల్ల వాహనాలు అన్ని చౌరస్తా ప్రాంతంలో నిలిచిపోయాయి. ముంపు వల్ల నష్టపోతున్న తనకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఆర్డీవో తమకు హామీ ఇస్తే కానీ ఇక్కడి నుండి విశ్రమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. మంథని ఎమ్మార్వో బండి ప్రకాష్ రైతుల వద్దకు వచ్చి మీ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సందర్భంగా మంథని ఎస్ఐ వెంకటేశ్వర్లు రైతులను సమన్వయపరిచి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ అన్నారం బ్యారేజ్ ముంపు బాధిత రైతుల ఆందోళనకు మంథనిలోని అఖిలపక్షం నాయకులు మద్దతు తెలిపి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.