బ్ర¬్మత్సవాలకు తిరుచానూరు ముస్తాబు

 

భక్తులకు సర్వస్వతంత్ర వీరలక్ష్మి అభయం

అరగంట ముందుగా రాత్రి వాహనసేవ

తిరుపతి,నవంబరు19(జనం సాక్షి): శాసనాధారాల ప్రకారం ఇక్కడున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. టిటిడి పరిధిలో ఉన్న ఆలయాల్లో పురాతన ఆలయంగా గుర్తింపు పొందింది. ద్వాపరయుగం చివరలో కలియుగం ప్రథమంలో తిరుచానూరు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా వైకుంఠంలోని శ్రీవేంకటేశ్వరుడు తన హృదయలక్ష్మి లేకపోవడం వల్ల విరక్తి చెంది స్వర్ణముఖి నదీతీరానికి చేరుకుని తపం ఆచరించి శ్రీపద్మావతి సాక్షాత్కారం పొందారు. ఆ తరువాత కాలంలో శుక మహర్షి ఈ ప్రాంతానికి చేరుకుని శ్రీమహాలక్ష్మి అనుగ్రహం పొందారు. శుక మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇది తిరుశుకపురం అయింది. ఆ తరువాత కాలంలో తిరుశుకనూరుగా, తిరుచానూరుగా మారింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు అభయమిస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన వేంకటాచల మహత్యం గ్రంథం ప్రకారం శ్రీవారు తపస్సు చేసిన అనంతరం తిరుచానూరులోని పద్మసరోవరంలో సహస్ర స్వర్ణ కమలంలో వీరలక్ష్మి, వ్యూహలక్ష్మి ఉద్భవించారు. వ్యూహలక్ష్మి స్వామివారితోపాటు తిరుమలకువెళ్లి శ్రీవారి వక్షఃస్థలం లో నిలిచారు. వీరలక్ష్మి తిరుచానూరులోనే ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులను దీవించి స్వామివారి దర్శనం కోసం తిరుమలకు పంపుతున్నారు. సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో తొమ్మిది రోజుల పాటు బ్ర¬్మత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు బ్ర¬్మత్సవాలు జరుగ నున్నాయి. నవంబరు 22న అంకురార్పణ నిర్వహిస్తారు. గతేడాది వరకు బ్ర¬్మత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 11 గంటల వరకు వాహనసేవలు నిర్వహించేవారు. భక్తుల కోరిక మేరకు ఈసారి రాత్రి వాహన సేవను అరగంట ముందుగా ప్రారంభించాలని టిటిడి నిర్ణయించింది. అనగా రాత్రి వాహనసేవ 7.30 నుండి 11 గంటల వరకు జరుగుతుంది. తిరుమల శ్రీవారి బ్ర¬్మత్సవాల తరహాలో అమ్మవారి బ్ర¬్మత్సవాలనువైభవంగా నిర్వహించేందుకు టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పద్మపుష్కరిణిని శుద్ధి చేసి నీటితో నింపారు. ఆలయం నుండి శిల్పారామం వరకు ప్రధాన రహదారిపై రంగురంగుల విద్యుత్‌ దీపాలతో తోరణాలు ఏర్పాటుచేశారు. ఆలయ మాడ వీధుల్లో చలువసున్నం, రంగోళీలు తీర్చిదిద్దారు. ఆలయంలోపల ఆలయ పెయింటింగ్‌ పూర్తి చేసి లైటింగ్‌ ఏర్పాట్లు చేపడుతున్నారు. వాహనసేవల కోసం వినియోగించే వివిధ వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. బ్ర¬్మత్సవాల్లో నిర్వహించే వివిధ కైంకర్యాలకు అవసరమైన పూజాసామగ్రి, ఇతర వస్తువుల కొనుగోళ్ల పక్రియ కూడా పూర్తయింది. అదేవిధంగా ఇంజినీరింగ్‌, ఆరోగ్య, భద్రత తదితర విభాగాల అధికారులు తమ పరిధిలోకి వచ్చే పనులను వేగవంతం చేశారు.