బ్రిక్స్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్

వాషింగ్టన్ : ఒక దేశానికి మరో దేశం ఆర్థిక సహాయార్థం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ దేశాలు, బ్యాంకింగ్ ఇన్ స్టిట్యూట్ ను, రేటింగ్ ఏజెన్సీను స్థాపించుకోనున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ అభివృద్ధి బ్యాంక్ ను పూర్తిగా కార్యరూపంలోకి తేవడానికి ఈ ఇన్ స్టిట్యూట్, రేటింగ్ ఏజెన్సీ తోడ్పడేలా చేయాలని నిర్ణయించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన వార్షిక స్ప్రింగ్ సమిట్ లో బ్రిక్స్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు హాజరయ్యారు.

 బ్రిక్స్ దేశాలు తీసుకున్న ఈ నిర్ణయంపై టెక్నికల్ గ్రూప్ పూర్తిగా విశ్లేషించనుంది. వారి నివేదికను వచ్చే సమావేశంలో బ్రిక్స్ ఆర్థికమంత్రులకు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సమర్పించనున్నారు. ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాలు షాంఘై కేంద్రంగా బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటుచేసుకున్నాయి. అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లతో 2015 జూలై నుంచి ఈ బ్యాంకు పూర్తి కార్యాచరణలోకి వచ్చింది.