భద్రాచంల రైతులకు తీరని నష్టం

ఇంకా బురదలోనే ముంపు గ్రామాలు
కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం

భద్రాచలం,జూలై19(జనం సాక్షి): గోదావరి వరద తీరప్రాంతానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం గోదావరి వరద తగ్గుముఖం పట్టినా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, అశ్వాపురం మండలాల్లోని 114 గ్రామాలు ముంపునకు గురవగా.. ఇంకా 71గ్రామాలు వరదలోనే ఉన్నాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. పూర్వస్థితికి రావడానికి ఎన్నోనెలలు పడుతుంది. మరోవైపు భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 56.1అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఎగువన ఇంద్రావతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రభావంతో పేరూరు వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వచ్చింది. దీంతో భద్రాచలం వద్ద రాత్రి 11గంటలకు 56.3అడుగులకు చేరింది. ఈ నీటిమట్టం వద్ద 15,96,899 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళుతోంది. సోమవారం రాత్రి నుంచి ఎగువనుంచి వరద ప్రవా హం పెరిగే అవకాశం ఉండడంతో మరోసారి భద్రాచలం వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర జల సంఘం అధి కారులు అంచనా వేస్తున్నారు. రోడ్లు, ఇళ్లు బురదమయంగా మారడం తో.. వరద తగ్గిందన్న సంతోషం కన్నా.. తమ బతుకులు ఎప్పుడు బాగుపడ తాయోనన్న బాధే వారిలో కనిపిస్తోంది. ఐదురోజులుగా నిలిచిన వరదతో పలు గ్రామాల్లో పూరిళ్లు, గడ్డి ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా పెంకుటిళ్లు, భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ముంపు తగ్గిన చోట బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుని ఇళ్లను బాగుచేసుకుం టున్నారు. గోదావరి పరివాహాక రైతులను నిలువునా ముంచింది. ఈ వానాకాలం సీజన్‌లో వరి, పత్తి, మిర్చి సాగు చేద్దామనుకుని తొలకరి వర్షాలతో చెలక బాట పట్టిన రైతులు ఆశలన్నీ అడియాలయ్యాయి. గోదావరి నది కనీవిని ఎరుగని రీతిలో ఉగ్రరూపం దాల్చి పరివాహాక ప్రాంత రైతుల ఆశలపై వరద పారించింది. పొలాలను దమ్ము చేసి నాట్లు వేద్దా మను కునే
సమయంలో వచ్చిన గోదావరి వరదలు నిలువునా ముంచేశాయి. వరినారు మళ్లన్నీ నాలుగు రోజుల పాటు గోదావరి వరదల్లో మునిగి పోయాయి గోదావరి తగ్గడంతో పొలాల్లోని నారుమళ్లన్నీ మురిగిపోయి దర్శన మిచ్చాయి. దీంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆగస్టు నెలలో సహజంగా గోదావరి ప్రవాహం పంటను ముంచెత్తేదని, ఈ సారి జూలై నెలలోనే ఇంత పెద్ద ఎత్తున వరదలు రావడం ఊహించలేదన్నారు వరి, మిరప నారు మళ్లు, పత్తి మొక్కలు, కూరగాయ మొక్కలు నామరూపాల్లేకుండా పోయాయన్నారు. తిరిగి సాగును ఆరంభిస్తే వచ్చేనెలలో వరదలు వస్తే పరిస్థితి ఏంటని అంటున్నారు. మరోవైపు పారిశుధ్య కార్మికులు రోడ్లపై పేరుకుపోయిన చెత్త, బురదను తొలగించే పనులు చేస్తున్నారు. అయితే బురద, నిమ్ము కారణంగా న్యుమోనియా, ఇతర అంటు వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలోని పంచాయతీ, ఆర్‌అండ్‌బీ రహదారులు చాలాచోట్ల దెబ్బతినగా.. ఇప్పట్లో రాకపోకలు కొనసాగే అవకాశం కనిపించడంలేదు. ఇక విద్యుత స్తంభాలు, లైన్లు దెబ్బతినడంతో గ్రామాలు అంధకారంలో మగ్గుతుండగా.. విద్యుత పునరుద్ధరణకు కనీసం నెలపడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. వరద కారణంగా బోర్లు, బావుల్లోని నీరు కలుషితం కావడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. యంత్రాంగం వరద గ్రామాలకు తాగునీటిని అందించాల్సిన అవసరం ఉంది. పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ సేకరించిన ప్రాథమిక సమాచారంతో తెలిసింది. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ ఆధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయడంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి. ఈ సందర్బంగా వారికి నీట మునిగిన పత్తి పొలాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వరినారు మడులు నీట మునగడం వల్ల నారు కుళ్లి నష్టం వాటిల్లుతుందని, స్వల్పకాల వరి రకాలను నేరుగా విత్తుకోవాలని తద్వారా కొంత లబ్దిచేకూరుతుందని వివరించారు. అయితే గోదావరి వరద ప్రభావిత గ్రామాల్లో పంట నష్టం అంచనా వేయడం కష్టంగా ఉంది. వరద పూర్తిగా తగ్గితే కాని నష్టం అంచనా వేయలేమని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.