భద్రాద్రి జిల్లాల్లో ప్రత్యేక నిఘా

సరిహద్దు రాష్ట్రం కావడంతో ముమ్మర కూంబింగ్‌

ఎన్నికలకు ఆటంకం లేకుండా చర్యలు

భద్రాద్రికొత్తగూడెం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఛత్తీస్‌ఘడ్‌కు సరిహద్దుల్లో ఉన్న కారణంగా ఎన్నికల్లో ఇక్కడా మావోల ప్రభావం ఉంటుందన్న అనుమానంతో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ముందసత్తు ఏర్పాట్లలో భాగంగా ఈ కోణంలోనే ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 198 పోలింగ్‌ కేంద్రాలు నక్సల్స్‌ ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలుగా, మరో ఏడు తీవ్ర ప్రభావిత పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని మని ఎస్పీ సునీల్‌దత్‌ చెప్పారు. జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రాంతాల్లో గ్రేహౌండ్స్‌, ప్రత్యేక పోలీస్‌ బలగాలతో ఇప్పటికే నిరంతర నిఘా ఏర్పాటు చేసి కూంబింగ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మద్యం అక్రమ రవాణా, ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీని అరికట్టేందుకు ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు. పోలీంగ్‌ పక్రియ ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో తనిఖీల్లో రూ.33లక్షల విలువైన నగదు, వస్తువులను సీజ్‌ చేశామని చెప్పారు. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. నామినేషన్ల పక్రియ నుంచి పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసే వరకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో ఎన్నికల వ్యయ పరిశీలకులు పర్యటిస్తున్నందున ఎన్నికల అభ్యర్థుల ప్రచార ఖర్చును పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీ విజిల్‌కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే 110 నిమిషాల్లో సమస్యను పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కదలికలను ప్రత్యేక నిఘాతో పరిశీలించి ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందిస్తుంటామన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల పక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.