భవంతుల కూల్చివేత అధికారం ఏవరిచ్చారు

.2

– సీఎం కేసీఆర్‌పై నాగం ఫైర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనరసాక్షి ) :

ఉస్మానియా ఆస్పత్రి కూల్చివేతను అడ్డుకుంటామని బీజేపీ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి హెచ్చరించారు. హెరిటేజ్‌ భవనాలను కూల్చే అధికరాం సిఎంకు తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. ఇందుకోసమే అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. బిజెపి మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాసరెడితో కలసి ఆయన సోమవారం విూడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్‌కు ఒక లక్ష్యం, క్రమశిక్షణ లేవని.. అందుకే రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని నాగం విమర్శించారు. మొన్నటి వరకు సచివాలయం, చాతి ఆస్పత్రి తరలించాలని హడావుడి చేసి, ఇప్పుడేమో ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం హడావుడి చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా చోట్ల నిధుల్లేక పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. తానే ఓ సూపర్‌ ఇంజనీరుగా చెప్పుకుంటూ సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను పండపెడుతున్నాడని మండిపడ్డారు. పథకాల పేరుతో సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని  నాగం జనార్ధన్‌ రెడ్డి ఆరోపించారు. . రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించని కేసీఆర్‌ వాటర్‌ గ్రిడ్‌ పథకానికి రూ. 40వేల కోట్లు కేటాయించడంలో మతలబు ఏంటని నాగం ప్రశ్నించారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ. 15 వేల కోట్లు కేటాయిస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందిచవచ్చని  ఆయన సూచించారు.  ఇప్పటి వరకు ఆయన పథకాలే తప్ప కార్యాచరన చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాలను ఖాళీ చేయిస్తే ఊరుకోబోమన్నారు. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను బలవంతంగా లాకోవాలనుకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు 15వేల కోట్ల రూపాయలను కేటాయిస్తే సుమారు 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరు  వచ్చి చేకూరుతుందన్నారు. ఆ పనిచేయకుండా తన ఒంటెద్దు పోకడలతో ముందుకు పోతూ ఇంజనీర్లను అవమాన పరుస్తూ తానే పెద్ద ఇంజనీర్‌నని గూగుల్‌ మ్యాప్‌ చూపుతున్నారని అన్నారు. కొద్ది కొద్దిపాటి నిధులను కేటాయించినా కూడా తెలంగాణాలో పూర్తయ్యే ప్రాజెక్టులు అనేకం ఉన్నాయన్నారు. ప్రాణహిత-చేవెళ్ల, దుమ్ముగూడెం టేయిల్‌ పాండ్‌లను వదిలేస్తే మిగతావన్ని కూడా నామమాత్రం నిధులు కేటాయిస్తే పూర్తయ్యేవేనని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కేవలం 600 కోట్లు పనులకోసం 500 కోట్లను నిర్వాసితులకోసం కేటాయిస్తే వినియోగంలోకి వస్తుందన్నారు.  గతంలో చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేసుకుంటూ కొత్త ప్రాజెక్టులను చేపట్టడంలో ఆంతర్యమేమిటని  ప్రశ్నించారు. కరీంనగర్‌ జిల్లాలో తోటపల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో కేవలం ఆనకట్ట మాత్రమే మిగిలిందని ఇక్కడ కేవలం 250 కోట్లతో ఆనకట్ట నిర్మాణం పనులు, మరో 1600ఎకరాల భూములకు నష్ట పరిహారం ఇస్తే సరిపోతుందన్నారు. బంగారు తెలంగాణా పేరుతో ఇంకా ఎంతోకాలం మభ్యపెట్టలేరని అన్నారు.  అబ్దుల్‌ కలాం పేరెత్తే అర్హత కేసీఆర్‌కు లేదని ఆయన మండిపడ్డారు. కలాం అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధిని కూడా పంపలేదని ఆయన అన్నారు. కరువు మండలాలను ప్రకటించని ఏకైక సీఎం కేసీఆరేనని నాగం విమర్శించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల గురించి ఆలోచిస్తే, రూ.15 వేల కోట్లతో 30 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని నాగం జనార్థన్‌ రెడ్డి స్పష్టం చేశారు.