భవిష్యత్‌ ఉద్యమాలకు అన్నదాతల ప్రేరణ

ప్రజావ్యతిరేక నిర్ణయాలకు రైతు పోరాటం స్ఫూర్తి

ఉద్యమాలతో పాలకులకు చెక్‌ పెట్టక తప్పదు

న్యూఢల్లీి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు సుదీర్ఘ కాలం సాగించిన ప్రజా పోరాటం అన్నదాతలదే అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ సమాజం నుండి ఈ పోరాటానికి వెల్లువెత్తిన సంఫీుభావమే ఇందుకు నిదర్శనం. ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయ ఉద్యమాల జాబితాల్లో ఢల్లీి అన్నదాతల ఉద్యమం నిలుస్తుంది. అందరికీ అన్నం పెట్టే చేయి అవసరమైతే ఉద్యమిస్తుందని ఢల్లీిలో రైతులు తమ సత్తా చాటారనడంలో సందేహం లేదు. దేశ చారిత్రక ఘట్టాల్లో రైతుల ఉద్యమం నిలుస్తుంది. ఢల్లీి పెద్దల మెడలొంచిన ఈ పోరాటం ఎన్నో విధాల ప్రత్యేకమైనది. సాగుచట్టాలతో అన్నదాతల జీవితాలను మరింత అతలాకుతలం చేస్తాయన్న విషయంలో రేగుతున్న చర్చ జరిగితే కనీసంగా  కూడా మోడీ ప్రభుత్వం స్పందించలేదు. ఈ చట్టాలు ఎలా మంచి చేస్తాయో చెప్పలేదు. ఈ బిల్లులను ఆమోదించిన తీరు ప్రజాస్వామ్యాన్ని ఒక ప్రహసనంగా మార్చిందన డంలో ఏ మాత్రం సందేహం లేదు. ముందుతరం నేతలు బిజెపిలో ఆధిపత్యం చెలాయించి ఉంటే బహుశా ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాహసించేవారు కాదేమో. బిల్లు ఆమోదించే క్రమంలో ఎన్డీఏలో భాగస్వామి అయిన అకాలీదళ్‌కు చెందిన మంత్రి రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దాదాపు 18 పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ చట్టాలపై రాష్టాల్ర ముఖ్యమంత్రులతో మాట్లాడడం కానీ, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఒక బిల్లును ఏదో రకంగా, కనీస చర్చ లేకుండా, సభ్యుల మనోభావాలతో నిమిత్తం లేకుండా తాను అనుకున్న రోజే ఆమోదింప చేయాలని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్న తీరు కారనంగానే అన్నదాతలు రోడ్డెక్కాల్సి వచ్చిందని ఇప్పటికైనా గుర్తించి వెనక్కి తగ్గడం మంచిదే. ఈ బిల్లులను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం దేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న చిత్తశుద్ధిని ప్రదర్శించ లేదని తేలిపో యింది. కార్పేరేట్‌ రంగాన్ని సంతృప్తి పరిచి వారికి నూతనావకాశాలు కల్పించా లన్న సంకల్పమే కనిపించింది. తన వైఫల్యాల నుంచి చేతులు దులుపుకునే ప్రయత్నంలో భాగంగా మోడీ ఇప్పుడు రద్దుకు చర్యలు చేపట్టారనే చెప్పాలి. రైతులు సాధించిన అతిపెద్ద విజయంగా ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. వారి పోరాటస్ఫూర్తి మున్ముందు ఉద్యమాలకు ప్రేరణ కానుంది. ఈ క్రమంలో పాలకుల నిరంకుశ విధానాలకు ప్రజలు చైతన్యం కావాలి. పోరాటస్ఫూర్తిని పొందాలి. కార్పొరేట్‌ కంపెనీ లకు వ్యవసాయాన్ని గంపగుత్తగా కట్టబెట్టే పన్నాగంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర చట్టాలను, విద్యుత్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కనీస మద్దతు ధర కోసం చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ 2020 నవంబరు 26న ఢల్లీి సరిహద్దుల్లో ప్రారంభించిన అన్నదాతల ఆందోళనలు ఎట్టకేలకు ఫలించాయి. కష్టజీవు ల కష్టార్జితాన్ని కార్పొరేట్‌ బొక్కసాలకు దోచిపెట్టేసి అటు రైతుల హక్కులనే కాకుండా ఇటు ప్రజల ఆహార భద్రత హక్కును కూడా కాలరాయాలని చూసిన పాలకుల దుర్నీతిని ఎండగట్టిన  మహోజ్వల ఉద్యమాన్ని వీరోచితంగా సాగించిన అన్నదాతల చరిత్ర చిరస్థాయిగా నిలుస్తుంది. క్రమశిక్షణతో అత్యంత ప్రజాస్వామ్య యుత పద్ధతుల్లో హింసకు ఏమాత్రం తావు ఇవ్వకుండా ఈ ఉద్యమం సాగింది. ఈ పోరాటాన్ని అణిచి వేసేందుకు పాలకులు పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. అయినా రైతే గెలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500 పైబడి రైతు సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం) పేరిట ఒకే గొడుగు కిందకు రావడం అసాధారణమైన విషయంగా చూడాలి. వ్యవసాయ పనుల్లో సగానికి పైగా మహిళలే కావడం..ఈ  ఉద్యమంలోనూ వారే తమ శక్తిని చాటడం గమనించాలి.  పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా పోరు సల్పారు. భారత్‌ బంద్‌ సహా సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన అన్ని ఉద్యమ పిలుపుల్లోనూ సమస్త ప్రజానీకం భాగస్వాములై ప్రజాపోరాటంగా చాటాయి.  అదానీ, అంబానీ సంస్థల ఉత్పత్తులను బహిష్కరిం చాలని పిలుపునివ్వడం సామాన్యమైన విషయం కాదు. ఖలిస్తానీలు, మావోయిస్టులు, పాకిస్తాన్‌, చైనా ఉసిగొల్పితేనే రైతులు రంగంలోకి దిగారంటూ ప్రభుత్వ అనుకూల విూడియా దుమ్మెత్తి పోసినా కష్టజీవులు చలించలేదు. ఉద్యమిస్తున్న రైతులను మంత్రి కుమారుడు కాన్వారుతో తొక్కించి చంపేయడం వంటి ఎన్ని దారుణాలకు పాల్పడినా రైతే నిలిచి గెలిచాడు. భవిష్యత్‌ ఉద్యమాలకు..పాలకుల వ్యతిరేక విధానాలకు ఇది ఉత్తేజితం కాగలదు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌ అమరావతిపై ఆడుతున్న నాటకానికి కూడా ఈ ఉద్యమం తోడు కాగలదు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే అక్కడా బొక్కబోర్లా పడడం ఖాయం.