భవిష్యత్ అవసరాల కోసం “ఇంటర్నల్ పైప్ లైన్లు
అధికారులకు సూచించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
రిజర్వాయర్లు, పైపులైన్ పనుల పర్యవేక్షణ
మేడిపల్లి – జనంసాక్షి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫేస్-2లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి గడపకు రక్షిత మంచినీరు అందించాలనే సంకల్పంతో నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పైపులైన్ పనులను మేయర్ జక్క వెంకట్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యుఎస్, ఎస్ బి జిఏం పి. శ్రీనివాస్ రెడ్డి మరియు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా పీర్జాదిగూడ నుండి పర్వతాపూర్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంటర్నల్ పైప్ లైన్స్ వేయవలసిందిగా అధికారులకు సూచించారు. గతంలో నగర ప్రజలకు మంచినీటికి తీవ్రమైన ఎద్దడి ఉండేదని పాలక మండలి ఏర్పడిన మొదలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి సహకారంతో సుమారు 40లక్షల లీటర్ల కేపాసీటి కలిగిన రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా మంచి నీరు ప్రతి ఇంటికి రోజు విడిచి రోజు సరఫరా చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం ఫేస్-2 ద్వారా హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో 90లక్షల లీటర్ల నీటి సరఫరా సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్లు,పైప్ లైన్స్ నిర్మాణం చేపడుతున్నామని, అవి ఫిబ్రవరి వరకు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 24 గంటలు మంచినీరు సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తద్వారా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొల్తూరి మహేష్, టిపిఎస్ రాజీవ్ రెడ్డి, ఎఈ బిక్షపతి, హెచ్ఎండబ్ల్యుఎస్ ఎస్ బి డిజిఏం ఈ. నిర్మల, హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ ఏ. రమ్యప్రియ, వర్క్ ఇన్ స్పెక్టర్ విజయపాల్ రెడ్డి, ఎన్ సీసీ ఏజెన్సీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.