భాజపా నేతలు.. శిఖండుల్లా వ్యవహరిస్తున్నారు

– ఏపీకి చెంబుడు నీరు, పిడికెడు మట్టి తప్పఏవిూ ఇవ్వలేదు
– పోలవరంకు ఏపీ ప్రభుత్వం ఖర్చుచేసిన నిధులే ఇప్పటికీ ఇవ్వలేదు
– అమిత్‌షా బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడు
– ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, ఫిబ్రవరి22(జ‌నంసాక్షి) : రాష్ట్ర అభివృద్ధి విషయంలో భాజపా నేతలు శిఖండుల్లా వ్యవహరిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రాష్ట్రానికి పదిలక్షల కోట్ల రూపాయలు ఇచ్చామంటూ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. ఓ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండి ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నారు. లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్ని ఇంత వరకూ ఇవ్వలేకపోయిందని మంత్రి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలే ఆవార్డులు ఇస్తుంటే నేతలు మాత్రం ఆవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ఏపీకి చెంబెడు నీరు, పిడికెడు మట్టి తప్ప ఏవిూ ఇవ్వలేదని అన్నారు. ఇటు రాష్ట్ర ప్రతిపక్షం రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేసి పూర్తిగా ప్రధాని మోదీకి సాగిలపడ్డారని ఆరోపించారు. బెదిరింపులు చేస్తూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. భజన హావిూలు 18అమలు జరపాల్సి ఉండగా, 14అంశాలని అమిత్‌షా మాట్లాడుతున్నారని అన్నారు. పుల్వామా సంఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అమిత్‌షా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాఫెల్‌ కుంభకోణం అంశం ప్రజలకు తెలిసిందేనని, బీజేపీ అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించారు.  ‘కేంద్రం విభజన హావిూలను నెరవేర్చకపోయినా, ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం చంద్రబాబును బీజేపీ నేతలు విమర్శించినా తెలుగు వారి గుండె రగులుతుందన్నారు. చంద్రబాబుపై అమిత్‌షా అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని, అమిత్‌షా, మోదీ ఏ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అద్దె మైకులా అమిత్‌షా మాట్లాడారని మండిపడ్డారు. జగన్‌, కేసీఆర్‌ సహకారంతోనే అమిత్‌షా ఏపీలో తిరుగుతున్నారన్నారు. జవాన్లపై దాడులు జరిగినప్పుడు నాలుగున్నర గంటలపాటు మోదీ ఎక్కడున్నారని, ఓట్లు దండుకునేందుకు బీజేపీ దేశ భద్రతను రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. గతంలో మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ అన్న మాటల వీడియోను ప్రదర్శించారని, ఇప్పుడు మోదీ, అమిత్‌షా, బీజేపీ నాయకులు ఏం సమాధానం చెప్తారంటూ ఆయన నిలదీశారు. అలాగే అవినీతి పరుడైన జగన్‌ను బీజేపీ అక్కున చేర్చుకుని ఏపీకి ద్రోహం చేస్తోందని ఆయన అన్నారు.
అలాగే ఆదర్శ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారని మంత్రి అన్నారు.