భాజపా భయపడుతోంది
– ఆనంద్ బెన్ నా పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది
– ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రివాల్
అహ్మదాబాద్,జులై 9(జనంసాక్షి): మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి బీజేపీ పాలితరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్పై విమర్శలు అస్త్రం ఎక్కుపెట్టి ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరగాల్సిన తన కార్యక్రమాన్ని ఆనందీబెన్ అడ్డుకుంటున్నారని కేజీవ్రాల్ ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ వారివారి అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందన్న విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. శనివారం ఉదయం కేజీవ్రాల్ తన కుటుంబ సభ్యులు, ఆప్ నేతలతో కలసి గుజరాత్లోని రాజ్‌కోట్‌కు వెళ్లి సోమ్నాథ్లోని ప్రసిద్ధ శివాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ రెండురోజుల పర్యటనకు గుజరాత్కు వచ్చానని పేర్కొన్నారు. మరోవైపు ఆదివారం సూరత్ వెళ్లాల్సివుందని, కాని ముఖ్యమంత్రి ఆనందీబెన్ సూరత్లోని వ్యాపారవేత్తలు, ప్రజలపై ఒత్తిడి చేసి తమ పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేయించారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరోవైపు సూరత్ పర్యటనకు రావాలని కేజీవ్రాల్కు పంపిన ఆహ్వానాన్ని ఓ వర్తక సంఘం విరమించుకుంది. దీంతో ఈ రద్దు వెనక బీజేపీ ప్రభుత్వం హస్తముందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.