” భాజాపా పాలనలోనే ప్రభుత్వ విద్యకు భవిష్యత్తు – బిజెపి నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న ప్రభుత్వ విద్యను తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకురావాలంటే రానున్న భారతీయ జనతాపార్టీ సుపరిపాలనతోనే సాధ్యమవుతుందని భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధి అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, వడ్డెర బస్తిలలో నెలకొనివున్న ప్రభుత్వ పాఠశాలలను స్థానిక నాయకులతో కలిసి గజ్జల యోగానంద్ గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా ఆయా పాఠశాలలలోని సమస్యలను, మౌలిక సదుపాయాలను విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో యోగానంద్ మాట్లాడుతూ యావత్తు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఏ ప్రభుత్వపాఠశాలను గమనించినా అనేకమైన సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని, ప్రాధమిక పాఠశాలల్లో విద్యార్థులకు కనీసం సరిపడా తరగతిగదుల లేమితో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గజ్జల దుయ్యబట్టారు. ఇక పైతరగతుల్లో మౌలికవసతుల కొరతతో అపసోపాలపాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, సిగ్గులేని తెరాస సర్కారు విద్యకు కేటాయించిన నిధులనుసైతం బొక్కుతూ తిరిగి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాంచేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. తరగతి గదులలో ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు లేక అవస్థలు పడుతున్నారని, ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, సరస్వతీపుత్రుల తెలంగాణకు బదులు భవిష్యత్తులో తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చేందుకు గులాబీ దండు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని గజ్జల జోస్యం చెప్పారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడంలేదని,
విద్యార్థులకు ఇప్పటివరకు సరిగ్గా స్కూల్ డ్రెస్ లు కూడా అందలేదంటే ఏమేరకు విద్యాబోధన తెలంగాణలో కొనసాగుతుందో ఊహించవచ్చన్నారు. ప్రైవేటు స్కూల్స్ లో చదివించే స్థోమత లేక ప్రభుత్వపాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్నామని, ఇక్కడచూస్తే పరిస్థితులు అత్యంత దారుణంగా, అద్వానం గా ఉన్నాయని కనీసం బాల బాలికలకు టాయిలెట్లు కూడా సరిగాలేవని విద్యార్థుల తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారని యోగానంద్ ఆరోపించారు. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంటనేస్పందించి ప్రతిపాఠశాలల్లో నెలకొన్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనకు పూనుకుంటామని గజ్జల యోగానంద్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎం. ఆంజనేయులు, మన్నెంకొండ సాగర్, సరోజ రెడ్డి, శివకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, సంతోష్ గుప్తా, వినీత సింగ్, సరస్వతి దేవి, వెంకటరమణ, మానెమ్మ, వెంకట్ నాయక్, ప్రవీణ్, కృష్ణ, చందర్, సంతోష్, సంపత్, విక్రమ్, రమేష్ రెడ్డి, చెన్నయ్య సాగర్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.