భానుడి భగభగలతో ప్రజల ఆందోళన

నిజామాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): భానుడు ప్రచండుడిలా మండిపోతున్నాడు.  ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరువ కావస్తోంది. ఈ సీజన్‌లో రికార్డుస్థాయి అత్యధికం నమోదు చోటుచేసుకుంది.  తీవ్రమైన ఎండ, దానికి తోడు వడగాలులు జనాలను, జంతువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదుకావడం భయాందోళనలకు గురిచేస్తోంది. గత వారం రోజులుగా 40 డిగ్రీలకు పైనే ఉండడంతో జనం బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటలలోపే పనులు
కానిచ్చేసుకుంటున్నారు. సాయంత్రం 5 గంటలు దాటినా ఇళ్ల నుంచి కాలు బయట పెట్టడంలేదు. వేసవి తాపం తాళలేక వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు విలవిల్లాడుతున్నారు. చిన్నపిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు సాహసించడం లేదు. వ్యాపారులు, ఉద్యోగస్తులు పగటిపూట కూలర్లు, ఫ్యాన్లు లేనిదే కూర్చుండలేని పరిస్థితి నెలకొంది. ఉపాధిహావిూ కూలీలు సైతం ఉదయమే పనులు ముగించుకుని 10 గంటలకల్లా ఇంటిబాట పడుతున్నారు.మరో రెండురోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, వడగాలులు నుంచి జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచిస్తోంది.ఐతే ఇంకా ఎండాకాలం నెలన్నర రోజులుండగానే సూర్యుడు భగభగ మండిపోవడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పుడు బంగాళాఖాతంలో ఆల్పపీడన ద్రోణి ఏర్పడడంతో అది కోస్తాంధ్రాపై ప్రభావం చూపి, మన ప్రాంతంలో రెండురోజుల్లో ఉష్ణం తక్కువ కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రబీ సీజన్‌లో వేసిన వరి పంట కోత దశకు వచ్చింది. మరో పక్షం రోజులైతే పంట పూర్తవుతుంది. చివరి తడి కోసం ఆరాటపడుతున్న అన్నదాతలు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. బోరుబావుల ద్వారా వేసిన పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పైరు కళ్లముందే ఎండిపోతుండడం
రైతులను తీవ్రంగా కలచివేస్తోంది. మరోవైపు కూరగాయలు, ఆకుకూరలు సైతం చేతికంద కుండా
పోతున్నాయి. ఎండకు మాడిపోతున్నాయి. అలాగే పౌల్టీ పరిశ్రమ విలవిల్లాడుతోంది. ఎండ వేడిమికి తట్టుకోలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి సంరక్షణకు ఆకుపచ్చ పందిళ్లు, గోనెసంచులు, గడ్డి కప్పి నానాతంటాలు పడుతున్నారు.