భారతీయ సినిమా ప్రదర్శనలపై పాక్ నిషేధం
ఇస్లామాబాద్,మే25(జనంసాక్షి): రంజాన్ సందర్బంగా సందర్భంగా భారత సినిమాల ప్రదర్శనపై నిషేధం
విధిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తమ చిత్రపరిశ్రమను కాపాడుకోవడానకేనని ఈ మేరకు వివరణ ఇచ్చుకుంది. ఈద్‌కి రెండ్రోజుల ముందు నుంచి సెలవులు ముగిసిన తర్వాత రెండు వారాల వరకు భారత్ సహా విదేశాలకు చెందిన సినిమాలు ప్రదర్శించరాదని ఆదేశించింది. ఈద్ ఉల్-ఫితర్, ఈద్ ఉల్-అజ సమయంలో ఈ నిషేధం కొనసాగనుంది. పాకిస్తాన్‌లోని స్థానిక సినిమా పరిశ్రమాకు నూతన జీవం పోసి, ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. నిషేధ సమయంలో విదేశీ సినిమాల ఇంపోర్టర్లు, డిస్టిబ్యూట్రర్లు పాక్ వ్యాప్తంగా సినిమా హాళ్లలో భారత సినిమాలను ప్రదర్శించకూడదు… అని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలతో తీవ్ర పోటీ ఎదువుతోందనీ.. తమ సినిమాలు ప్రదర్శించేందుకు థియేటర్లు కూడా దొరకడంలేదంటూ పాకిస్తాన్‌లోని సినీనిర్మాతలు, కళాకారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పండుగ సీజన్ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.