భారత్‌కు రష్యా ఎస్-400పై యూఎస్ ఆందోళన
– యూఎస్ ప్రిడేటర్ డ్రోన్ల అమ్మకాలపై ప్రభావం
న్యూఢిల్లీ, మే29(జనం సాక్షి) : రష్యా నుంచి అత్యాధునిక ఎస్-400 బాలిస్టిక్ క్షిఫణి వ్యవస్థను కొనుగోలు చేయాలన్న భారత్ యోచనపై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది అమెరికా-భారత్ దేశాల మధ్య సైనిక సహకారంపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని యూఎస్ హౌజ్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ విలియమ్ థోర్న్‌బెర్రీ తెలిపారు. ఎస్-400ల కొనుగోలుకు భారత ప్రయత్నాలపై వివిధ స్థాయిల్లో తమ ఆందోళనలను వ్యక్తపరుస్తామని అమెరికా తెలిపింది. అదేవిధంగా భవిష్యత్‌లో అమెరికా సున్నితమైన సాంకేతిక అంశాలను పంచుకోవడంలో కూడా ఈ అంశం కష్టతరం చేస్తుందని ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆ కమిటీ సభ్యులు తెలిపారు. ఎస్-400ల అంశంపై అమెరికా యంత్రాంగం, కాంగ్రెస్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తోందని వెల్లడించారు. భారత్-అమెరికా సంబంధాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు.రష్యా నుంచి వీటిని భారత్ కొనుగోలు చేస్తే యూఎస్ నుంచి భారత్ కొనుగోలు చేసే ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందంపై ప్రభావం పడుతుందని వెల్లడించారు. గత నెలలోనే ట్రంప్.. భారత్‌కు ప్రిడేటర్ డ్రోన్ల ఎగుమతులకు అనుమతి ఇచ్చారు. అయితే వాయు క్షిపణి రక్షణ వ్యవస్థను రష్యా నుంచి పొందేందుకు భారత్ రూ.39 వేల కోట్ల అంచనా వ్యయంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. దీనిపై అక్టోబర్‌లో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
——————————–