భారత్‌ ఎన్‌ఎస్‌జీ సభ్యత్వంపై చైనా మోకాలడ్డు

3

బీజింగ్‌,జూన్‌ 20(జనంసాక్షి): అణుసరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనా పాతపాడే పాడింది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌ సభ్యత్వం అంశం సియోల్‌ సమావేశం ఎజెండాలో లేదని చైనా సోమవారంనాడు ప్రకటించింది. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకించడం లేదని, చైనా కేవలం విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతోందంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదివారం ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా నుంచి ఈ స్పందన రావడం విశేషం. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భారత్‌ సంతకం చేయనందున ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వరాదన్నది చైనా వాదన. తాజాగా ఎన్‌ఎన్‌జీకి భారత్‌ సభ్యత్వం అంశం సియోల్‌ ఎజెండాలో లేనేలేదని చైనా విదేశీ మంత్విత్వ శాఖ ప్రతినిధి చున్‌యింగ్‌ తెలిపారు. అసలు ఎన్‌పీటీ సమావేశాల్లో ఎన్‌పీటీయోతర సభ్యులను చేర్చే అంశం ఎప్పుడూ అజెండాలో ఉండదని, ఈ ఏడాది సియోల్‌లో జరిగే సమావేశంలోనూ అలాంటి ప్రస్తావన ఉండదని ఆమె అన్నారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌ ఈనెల 16-17 తేదీల్లో చైనాలో పర్యటించి ఆదేశ విదేశాంగ మంత్రి వాంగ్‌-ఇని కలుసుకున్నారు. దీనిపై చున్‌యంగ్‌ మాట్లాడుతూ, ఇరుదేశాలు పరస్పరం తమ ఆలోచనలను పంచుకుంటున్నాయని, అయితే మరిన్ని చర్చలను బీజింగ్‌ కోరుకుంటోందని అన్నారు. భారత్‌ ఆశలపై చైనా వైఖరి అడిగినప్పడు, ఏ ఒక్క దేశానికి తమ దేశం వ్యతిరేకం కాదని ఆమె అన్నారు.