భారత్- పాక్ భద్రత సలహాదారుల చర్చలు రద్దు
దిల్లీ ఆగస్ట్22(జనంసాక్షి):
భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం జరగాల్సిన జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలు రద్దు అయ్యాయి. భారత్ విధించిన నిబంధనలు అనుసరించలేమని… చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రటకించింది. అంతకు ముందు భారత్ చర్చలపై అనిశ్చితి నెలకొంది ఇరు దేశాలు పరస్పరం తమ వాదనలు వినిపించాయి.
చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా లేదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. భారత్-పాక్ ఎన్‌ఎస్‌ఏ సమావేశం అంశంపై దిల్లీలో ఆమె విూడియాతో
మాట్లాడారు. పాక్ కేవలం కశ్మీర్ అంశంపైనే పట్టుబడుతోందని.. కేవలం పాక్ వైఖరి వల్లే ప్రతిష్ఠంభన నెలకొందని తెలిపారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మే 19న ఉఫాలో భారత్- పాక్ మధ్య చర్చలు జరిగాయని.. ఆనాటి చర్చల్లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. ఉఫాలో కుదిరిన ఒప్పందానికి భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. 2004-2005లోనూ చర్చలు జరిగినట్లు ఆమె గుర్తు చేశారు. అయితే పాక్ కాశ్మీర్‌ను ముందుకు తెస్తూ ప్రతిష్టంభనకు కారణమవుతోందన్నారు. దీంతో భారత్-పాక్‌ల మధ్య జరుగనున్న జాతీయ భద్రతా సలహాదార్ల సమావేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భారతదేశంతో చర్చలకు తాము సిద్ధమేనని, భారత్ చెబుతున్నట్టు కొత్త షరతులేవి పెట్టడంలేదని పాకిస్థాన్ జాతీయ భధ్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ స్పష్టం చేశారు. భారత్‌తో పూర్థిస్థాయిలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే ఇందులో కశ్మీర్ అంశాన్ని చేర్చితే తప్ప చర్చలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్ ఈ కొత్త మెలికపెట్టడంతో ఇప్పుడు చర్చలపై ప్రతిష్టంభన నెలకొనేలా ఉంది. ఇక భారత్‌లో హురియత్ నేతలను అరెస్టు చేయడంపై ఆయన స్పందిస్తూ హురియత్ నేతల అరెస్టు మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. చర్చల ఉపసంహరణ విషయంలో ఇరు దేశాలు ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. పాకిస్థాన్‌లో భారత నిఘా సంస్థ ‘రా’ నిర్వహిస్తోన్న కార్యకలాపాలకు సంబంధించిన దస్త్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో వీటిని భారత జాతీయ భద్రతా సలహాదారుకు అందజేస్తానని, అలాంటి అవకాశం రాకుంటే వచ్చే నెలలో న్యూయార్కులో అందేజేస్తానని తెలిపారు.