భారత్‌ బంద్‌ విజయవంతం

భారత్‌ బంద్‌ విజయవంతం
ధరల పెంపును నిరసిస్తూ రాజధానిలో భారీ ర్యాలీ                రెచ్చిపోయిన ఆందోళనకారులు
తగ్గించే వరకూ పోరాటం : నారాయణ                        హామీలను విస్మరిస్తున్న ప్రభుత్వాలు : రాఘవులు
హైదరాబాద్‌, మే 31 (జనంసాక్షి):
 గురువారం హైదరాబాద్‌ లో నారాయణగూడ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ వరకు వామపక్షాల నేతలు నారాయణ, రాఘవులు నేతృత్వంలో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టులను నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. బంద్‌కు వ్యతిరేకంగా నడుస్తున్న బస్సులపై ఆందోళన కారులు దాడులు నిర్వహించారు. బస్సులపై రాళ్లు రువ్వి టైర్ల నుంచి గాలిని
తీసివేశారు.  బంద్‌ రోజు కూడా తెరిచి ఉన్న వైన్‌ షాపులపై మహిళా వామపక్షాల కార్యకర్తలు దాడులు నిర్వహించారు. మద్యం బాటిళ్లను పగులగొట్టి  హంగామా సృష్టించారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు తుంగలో తొక్కు తున్నాయని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరో వైపు గ్యాస్‌, డీజిల్‌ ధరలను కూడా పెంచాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  పెట్రోల్‌ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ధరలను
తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు.      అనంతరం నారాయణ మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ , ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గజదొంగల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతర్జాతీయ చమురు  సంస్థల ధరలను సాకుగా చూపిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్నాయని నారాయణ విమర్శించారు. పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రభుత్వాలను స్తంభింపజేస్తామని నారాయణ హెచ్చరించారు.