భారత్‌ మాట నిలబెట్టుకోలేదు

– ఆయిల్‌ దిగుమతులు నిలిపివేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు
– ఇరాన్‌ దేశ రాయబారి మసూద్‌ రెజ్వానియాన్‌ రహీగి
న్యూఢిల్లీ, జులై11(జ‌నం సాక్షి) : చాబహర్‌ పోర్టు అభివృద్ధిపై భారత్‌ ఇప్పుడు మడమ తిప్పిందని ఇరాన్‌ దేశ రాయబారి మసూద్‌ రెజ్వానియన్‌ రహాగి ఢిల్లీలో ఆరోపించారు. ఇరాన్‌ నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న భారత్‌ ఆ దిగుమతులను నిలిపివేస్తే తమ దేశం ఇబ్బందులు పడుతుందన్నారు. ట్రంప్‌ తన స్వార్థపూరిత విధానంతో ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చూస్తున్నారన్నారు. 2017 ఏప్రిల్‌ నుంచి 2018 జనవరి వరకూ కేవలం పది నెలల్లోనే 18.4 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ను ఇరాన్‌ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుందన్నారు. భారత్‌తో ఇరాన్‌కున్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాలంటే రాజకీయపరంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని మసూద్‌ తెలిపారు. భారత్‌కి అత్యధికంగా ఆయిల్‌ను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాక్‌, సౌదీ తర్వాత ఇరాన్‌ అతి పెద్ద ఎగుమతిదారు. ఇప్పుడు ఈ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో బరాక్‌ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందాన్ని 2018 మేలో డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెరికా సన్నిహిత దేశాలు ఇరాన్‌ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్‌ పిలుపునిచ్చారు. ఆ మిత్ర దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఇరాన్‌తో చేసుకున్న ఒప్పందాలన్నీ తెరపైకి వచ్చాయి. 2016 మేలో భారత్‌, ఇరాన్‌, అఫ్ఘనిస్థాన్‌ సహా మధ్య ఆసియా దేశాలన్నిటికీ ఉపయోగపడే విధంగా చాబహర్‌ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఆయా దేశాల సమక్షంలో సంయుక్త ఒప్పందాలు కుదిరాయి. ఈ పోర్టు ద్వారా ఆయా దేశాల మధ్య రవాణా కారిడార్‌ ఏర్పాటుకు తీర్మానించాయి.