భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు తావు లేదు

స్పష్టీకరించిన నేపాల్‌ ప్రధాని ఓటీ
మోడీతో భేటీలో పలు అంశాలపై చర్చ
ఖాట్మండూ,మే12(జ‌నం సాక్షి ): భారత వ్యతిరేక కార్యకలాపాలకు నేపాల్‌ లో ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఉండదని, అలాంటి వాటిని తమ దేశం తీవ్రంగా పరిగణిస్తుందని నేపాల్‌  ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోదీ నేపాల్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. నేపాల్‌ ప్రధాని నుంచి వచ్చిన ఈ ప్రకటన తమను సంతృప్తినిచ్చిందని, ఇరు దేశాల మధ్య జరిగిన సమావేశం ఫలప్రదమైందని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే వెల్లడించారు. భారత్‌, పొరుగు దేశం నేపాల్‌ మధ్య 1,850 కిలోవిూటర్ల సరిహద్దు ఉంది. ఎలాంటి వీసా అవసరం లేకుండానే నేపాల్‌ ప్రజలు భారత్‌లో, భారతీయులు నేపాల్‌లో పర్యటించే సౌలభ్యం ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న సౌభ్రాతృత్వం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదం చేస్తోందని విూడియా సమావేశంలో ఇరు దేశాల ప్రధానులు వెల్లడించారు. ఇండియా-నేపాల్‌ సరిహద్దు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. 1950 లో జరిగిన ఇండో-నేపాల్‌ స్నేహ ఒప్పందం ద్వారా ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశంలోకి ప్రయాణించడానికి నిబంధనలను సులభతరం చేశారు. ఈ పర్యటన సందర్భంగా నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీతో మోదీ సమావేశమయ్యారు. ఉన్నత స్థాయి సమావేశాల వల్ల ఇరు దేశాల సంబంధాలు బలోపేతం అవుతాయని ఆమె పేర్కొన్నారు. జనక్‌పూర్‌ నుంచి అయోధ్య వరకు మొదలైన బస్సు సర్వీస్‌ వల్ల పర్యాటకం వృద్ధి చెందుతుందని గోఖలే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సార్క్‌ సమావేశానికి సంబంధించిన ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన అన్నారు. నేపాల్‌ ప్రస్తుతం సార్క్‌కు అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. సార్క్‌ సమావేశం జరిగేలా ఇండియా, పాకిస్థాన్‌తో మాట్లాడతానని నేపాల్‌ ప్రధాని గత నెలలో వెల్లడించారు. 2016లో ఇస్లామాబాద్‌లో సార్క్‌ సమావేశం జరగాల్సింది. కానీ జమ్మూ కశ్మీర్‌లోని ఉరి ఆర్మీ శిబిరం విూద ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్‌ ఆ సమావేశంలో పాల్గొనని తేల్చిచెప్పింది. చివరగా 2014లో ఖాట్మండూలో సార్క్‌ సమావేశం జరిగింది.